ఏలూరు జిల్లా ఎస్పీ వార్నింగ్
( ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో) : ఏలూరు జిల్లా (Eluru District) లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు, రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఆర్డీఓ వినూత్న, నూజివీడు డీఎస్పీ కేవీవీన్వీ. ప్రసాద్ పోలీస్, రెవెన్యూ అధికారుల బృందంతో కలిసి నూజివీడు ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. నూజివీడులోని మొగల్ చెరువు పరిసర ప్రాంతాలు తుపాను ప్రభావానికి గురయ్యే లోతట్టు ప్రాంతాలను పరిశీలించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు.
తుపాను తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున, అధికారులు సూచించిన సురక్షిత శిబిరాలకు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడం కోసం పోలీస్, రెవెన్యూ శాఖల అధికారుల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉండేలా ఏర్పాట్లను సమీక్షించారు.ఈడీఆర్ ఎఫ్ సహాయక బృందాలను, పడవలు, రెస్క్యూ కిట్‌లను సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, ఆహార నిల్వలపై దృష్టి సారించి, తుపాను అనంతరం కూడా మౌలిక వసతులకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజలు భయాందోళన చెందకుండా, అధికారులు చెప్పే సూచనలు, హెచ్చరికలు (Instructions and warnings) తప్పక పాటించాలని విజ్ఞప్తి చేసినారు. జిల్లా యంత్రాంగం, వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలు, సమాచారాన్ని రేడియో, టీవీ లేదా విశ్వసనీయ సోషల్ మీడియా ద్వారా నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. టార్చిలైట్, బ్యాటరీలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టె, త్రాగునీరు, పాడవ్వని ఆహార పదార్థాలు (బిస్కెట్లు, ఉప్పు, పంచదార, పప్పులు), ప్రాథమిక చికిత్స కిట్ (First Aid Kit) మరియు ముఖ్యమైన మందులు, నగదు వంటివాటిని సిద్ధం చేసుకోవాలి. పత్రాలు, విలువైన వస్తువులు: ముఖ్యమైన పత్రాలు (రేషన్ కార్డు, ఆధార్, బ్యాంక్ డాక్యుమెంట్లు) మరియు విలువైన వస్తువులను వాటర్‌ప్రూఫ్ బ్యాగుల్లో భద్రపరుచుకోవాలి.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండేవారు, అధికారులు ఏర్పాటు చేసిన సురక్షిత శిబిరాలకు వెంటనే తరలివెళ్లాలి. పశువుల సంరక్షణ: పశువులను, ఇతర పెంపుడు జంతువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలి. తుపాను సమయంలో బయటకు రావడం వద్దు బలమైన గాలులు వీచేటప్పుడు, భారీ వర్షాలు కురిసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుండి బయటకు రావద్దు. ఎలక్ట్రికల్ ఉపకరణాలను పూర్తిగా ఆపివేయాలి, మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయాలి. తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. బలహీనమైన చెట్లు, పాత గోడలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి. తుపాను గాలులకు అవి కూలిపోయే ప్రమాదం ఉంది. పుకార్లు లేదా వదంతులు నమ్మవద్దు. అధికారిక ప్రకటనలనే అనుసరించాలి. పొంగిపొర్లుతున్న నీటిలో ప్రయాణం చేయవద్దు. నీటి లోతు వేగం తెలియకుండా నడవడానికి లేదా వాహనాలు నడపడానికి ప్రయత్నించవద్దు. సహాయం కోసం సంప్రదించండి పోలీస్/విపత్తు నిర్వహణ హెల్ప్ లైన్ డయల్ 112 లేదా జిల్లా యంత్రాంగం ప్రకటించిన ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్ అగ్నిమాపక శాఖ 101 నెంబర్లు తెలిపారు.

