Collector | అలసత్వం వద్దు..
ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Collector | తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల (Nomination) ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నుస్తులాపూర్, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను, కొత్తపల్లి గ్రామపంచాయతీలో కొత్తపల్లి, రేణిగుంట పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ పత్రాలను, రిజిస్టర్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీచేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల నామినేషన్ దాఖలును రోజు వారిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అభ్యర్థుల అన్ని వివరాలు నామినేషన్ పత్రాలలో పూర్తిగా నమోదు చేసేందుకు హెల్ప్ డెస్క్ లో అవగాహన కల్పించాలని, సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు.


