Dogs Squad | అదుపులో ముగ్గురు వేటగాళ్లు…

Dogs Squad | అదుపులో ముగ్గురు వేటగాళ్లు…
ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు..
Dogs Squad | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ లోని ఊట్ల అడవుల్లో చిరుతపులిని వేటగాళ్లు హతమార్చారు. ఈ విషయం తెలుసుకున్న కవ్వాల టైగర్ రిజర్వు ఎఫ్డీపీటీ, సీఎఫ్ శాంతారాం, మంచిర్యాల డీఎఫ్ఓ శివ్ఆశీష్ సింగ్, స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్, తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావు, డాగ్స్ స్క్యాడ్ ఇంచార్జి ఎల్. అనిల్ కుమార్, ఇతర అటవీ అధికారులు శనివారం మధ్యాహ్నం వేటగాళ్లు చిరుతపులిని హతమార్చిన దండేపల్లి ఫారెస్ట్ సెక్షన్లోని ఊట్ల అటవీ ప్రాంతానికి వెళ్లారు.
ఈ సందర్భంగా వేటగాళ్లను అదుపులోకి తీసుకొని నిజా నిజాలు తెలుసుకోవడానికి ఆ అటవీ ప్రాంతానికి అధికారులు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ఊట్ల గ్రామానికి చెందిన అడవి జంతువుల వేటగాడు వెంకటేష్ వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగల విద్యుత్ షాక్కుగురై చిరుతపులి చనిపోయిందని నిర్ధారణ అయింది. ఆ చిరుతను తాళ్లపేట రేంజ్ లోని ఊట్ల, మామిడిపెళ్లికి చెందిన 3 వేటగాళ్లు హతమార్చి, ఆ చిరుతపులి గోర్లను తీసుకొని వెళ్లి లక్షెట్టిపేట ప్రాంతంలో విక్రయించడానికి ప్రయత్నించగా, మంచిర్యాల డీఎఫ్ఓకు అందిన సమాచారం మేరకు తాళ్లపేట అటవీ అధికారులకు ఆ వేటగాళ్లను పట్టుకొని విచారిస్తున్నారు.

ఆ చిరుతపులి మృతదేహాన్ని వేటగాళ్లు గోర్లు తీసుకొని అగ్నికి ఆహుతి చేశారు. ప్రస్తుతం ఆ చిరుత పులి కొన్ని అవశేషాలు, బూడిద మాత్రమే మిగిలింది. ఆ నిందితుల నుంచి చిరుతపులి కొన్ని గోర్లను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై స్థానిక ఎఫ్డీఓ ఎం.రామ్మోహన్ ను సాయంత్రం సంప్రదించగా, చిరుతపులి చనిపోయింది నిజమేనన్నారు. దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

CLICK HERE TO READ MORE : Highway-48 | భయంతో పరుగులు పెట్టిన జనం
