DOGS | వీది కుక్కలపై విషప్రయోగం

DOGS | వీది కుక్కలపై విషప్రయోగం

  • ఐదు గ్రామాల సర్పంచులపై కేసు నమోదు
  • రంగంలోకి స్ట్రే ఆనిమల్ ఫౌండేషన్ ప్రతినిధులు

DOGS | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధిలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో ఏకంగా 600 కుక్కలను విషప్రయోగం చేసి చంపడం స్థానికంగా పలు గ్రామాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐదు గ్రామాల సర్పంచ్లపై మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచారెడ్డి మండల పరిధిలోని భవానీపేట, ఫరీద్ పేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వర్ పల్లి గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వీధి కుక్కల సంఖ్య పెరిగిందని, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయనే విషయంలో స్థానిక సర్పంచ్ ల దృష్టికి వచ్చింది.

ఈ క్రమంలోనే కుక్కలను నియంత్రించేందుకు శాస్త్రీయ పద్ధతులు పాటించాల్సింది పోయి, మూకుమ్మడిగా విషం పెట్టి చంపాలని సర్పంచులు నిర్ణయించుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 600 కుక్కలు ఈ విషప్రయోగానికి బలై మృత్యువాత పడ్డాయి. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో కుక్కలు మృతి చెందడంపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్ట్రే ఆనిమల్ ఫౌండేషన్ ప్రతినిధులు ఐదు గ్రామాల్లో జరిగిన ఘటనపై లోతుగా విచారణ జరిపి, ఆధారాలతో సహా మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ పాలకవర్గాల అండదండలతోనే ఇంతటి అకృత్యం జరిగిందని వారు వాపోయారు. ఈ మేరకు భవానీపేట, ఫరీద్ పేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వర్ పల్లి గ్రామాల సర్పంచ్ లపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. చంపేసిన కుక్కలను గ్రామ శివారుల్లో పాతిపెట్టారనే సమాచారం మేరకు పోలీసులు, పశువైద్యాధికారులు వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

Leave a Reply