రోజూ బాదం తింటున్నారా.. నిద్ర విషయంలోనూ మేలు జరుగుతుందట!
- 20 వారాల అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు..
- త్వరగా నిద్రలోకి జారుకోవడంతో పాటు నిద్ర నాణ్యత మెరుగుపడినట్లు వెల్లడి
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బాదం పప్పు ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు. అయితే.. రోజువారీ ఆహారంలో బాదాన్ని చేర్చుకోవడం నిద్ర నాణ్యతకు కూడా మేలు చేయొచ్చని ఓ కొత్త అధ్యయనం సూచిస్తోంది. సరిగ్గా నిద్ర పట్టడం లేదని నివేదించిన భారతీయ పెద్దలపై నిర్వహించిన రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్‌లో.. రోజూ బాదం తిన్న వారిలో మొత్తం నిద్ర నాణ్యత మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు.. పడకపై గడిపిన సమయంలో ఎక్కువ భాగం నిద్రలోనే గడపడం, నిద్రలోకి త్వరగా జారుకోవడం వంటి మార్పులు కూడా నమోదయ్యాయి.
‘ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్’లో 2026లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న 175 మంది భారతీయ పెద్దలు పాల్గొన్నారు. వీరికి 20 వారాల పాటు రోజుకు 60 గ్రాముల బాదం పప్పులు (సుమారు 50 బాదం పప్పులు) లేదా సమాన కేలరీలు కలిగిన ఖాక్రా, చివ్డా, క్రాకర్స్ వంటి అల్పాహారాన్ని అందించారు. అనంతరం నిద్రలో వచ్చిన మార్పులను పరిశీలించారు. బాదం తీసుకున్న వారిలో స్వయంగా వెల్లడించిన మొత్తం నిద్ర నాణ్యత, నిద్రా సామర్థ్యం మెరుగుపడినట్లు అధ్యయనం తెలిపింది.
త్వరగా నిద్రలోకి.. మధ్యలో మెలకువ తగ్గే సూచనలు
బాదం తీసుకున్నవారు నిద్రలోకి జారుకోవడానికి పట్టే సమయం కూడా తగ్గినట్లు వెల్లడించారు. రాత్రి నిద్ర మధ్యలో మెలకువ వచ్చే సమయం తగ్గినట్లు కొన్ని సానుకూల సంకేతాలు కనిపించినప్పటికీ.. ఈ ఫలితాలు అధ్యయనంలో పాల్గొన్న అందరిలో ఒకే విధంగా కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. అంటే.. బాదం తినడం వల్ల ప్రతి ఒక్కరికీ ఒకే స్థాయిలో నిద్ర మెరుగుపడుతుందని ఈ అధ్యయనం నిర్ధారించలేదన్నమాట.
బాదంలో ఏముంది?
బాదంలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్-ఈ, ట్రిప్టోఫాన్‌తో పాటు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మెగ్నీషియం నాడీ వ్యవస్థ, కండరాల సాధారణ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ట్రిప్టోఫాన్‌ను శరీరం సెరోటోనిన్, మెలటోనిన్ వంటి సమ్మేళనాల ఉత్పత్తిలో ఉపయోగిస్తుంది. ఈ పోషకాలన్నీ నిద్రతో సంబంధం ఉన్న శారీరక ప్రక్రియలకు మద్దతు ఇవ్వవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే.. బాదంలోని ఏ పోషకం లేదా ఏ జీవశాస్త్ర ప్రక్రియ నిద్రలో మార్పులకు కారణమైందో నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం.
స్వయంగా చెప్పిన నిద్ర.. యంత్రాలతో కొలిచిన నిద్ర
ఈ అధ్యయనంలో నిద్రను రెండు విధాలుగా అంచనా వేశారు. పాల్గొన్న వారు తమ నిద్ర గురించి ఆమోదించబడిన ప్రశ్నావళి ద్వారా వివరించారు. మరోవైపు రాత్రిపూట పాలిసోమ్నోగ్రఫీ (పీఎస్‌జీ) ద్వారా నిద్రకు సంబంధించిన శారీరక మార్పులను కొలిచారు. పీఎస్‌జీని నిద్రను అంచనా వేసే ప్రామాణిక పద్ధతిగా పరిగణిస్తారు. అందువల్ల.. తమకు నిద్ర మెరుగుపడినట్లు వ్యక్తులు చెప్పడం, నిద్రలో శారీరక మార్పులు కచ్చితంగా నిర్ధారించడం రెండూ ఒకటేనని భావించకూడదని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఆరోగ్యకరమైన ఆహారంలో బాదం ఒక ఎంపిక
నిద్ర సరిగా పట్టని పెద్దల్లో రోజూ బాదం తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత, నిద్రా సామర్థ్యం, నిద్రలోకి జారుకునే సమయం వంటి అంశాల్లో మెరుగుదల కనిపించినట్లు ఈ పరిశోధన సూచిస్తోంది. అయితే.. ఇది బాదం నిద్రలేమికి చికిత్స అని నిర్ధారించే అధ్యయనం కాదు. నిద్ర సమస్యలు నిరంతరం ఉంటే కారణాన్ని గుర్తించి వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన, సమతుల ఆహారంలో భాగంగా బాదాన్ని చేర్చుకోవడం మాత్రం ఒక పోషకమైన ఎంపికగా ఉండొచ్చు.
గమనిక: ఈ కథనం ఒక పరిశోధనలో వెల్లడైన ఫలితాల ఆధారంగా రూపొందించబడింది. బాదం తినడం వల్ల ప్రతి ఒక్కరిలోనూ నిద్ర మెరుగుపడుతుందని హామీ ఇవ్వలేం. నిద్రకు సంబంధించిన నిరంతర సమస్యలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించాలి.
