రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ క్రికెట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండర్‌–17 బాలికల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి 69 మంది క్రీడాకారిణులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ ఎంపిక ప్రక్రియను వ్యాయామ ఉపాధ్యాయులు రామకృష్ణ, విజయ్ మోరే, అజ్మత్ ఖాన్, సిద్ధు, స్నేహ మోరే పర్యవేక్షించారు.

క్రీడాకారిణుల ప్రతిభను అంచనా వేసేందుకు బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ ,ఆల్‌రౌండర్ విభాగాల్లో ప్రత్యేకంగా పోటీలు నిర్వహించారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది క్రీడాకారిణులను రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ నెల 10 నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌–17 బాలికల క్రికెట్ పోటీల్లో ఎంపికైన క్రీడాకారిణులు ఉమ్మడి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల ఎస్‌జీఎఫ్ కార్యదర్శి అలివేలి మంగమ్మ, శ్రీధర్ మాట్లాడుతూ, ఎంపిక పోటీల్లో క్రీడాకారిణులు చక్కటి ప్రతిభ కనబరిచారని, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.