పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నాలుగు మండలాల్లో పర్యటన.. భద్రతా ఏర్పాట్లపై ఆరా
రంపచోడవరం, ఆంధ్రప్రభ బ్యూరో:
పోలవరం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, గంగవరం మండలాల్లోని పలు కేంద్రాలను తనిఖీ చేశారు.

అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్ల నిర్వహణ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్‌, అనధికార వ్యక్తుల ప్రవేశ నియంత్రణపై ఆరా తీశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఎన్నికల సంఘం నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.