తహసీల్దార్ల సేవలు ప్రశంసనీయం
- జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
- పదవీ విరమణ పొందిన బి.ప్రభులు, కిష్టయ్యలకు ఘన సన్మానం
సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సహజమైన ప్రక్రియేనని, ఉద్యోగ కాలంలో విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, అంకితభావం, ప్రజలకు అందించిన సేవలే వారి సేవా ప్రస్థానానికి నిజమైన గుర్తింపు అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. న్యాల్కల్ తహసీల్దార్ బి. ప్రభులు, చౌటకూర్ తహసీల్దార్ కిష్టయ్య బుధవారం ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రాత్రి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన బి.ప్రభులు, కిష్టయ్యలను కలెక్టర్ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో భాగంగా తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించినందుకు వారిని అభినందించారు. ప్రజలకు సేవ చేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకుని విధులు నిర్వర్తించిన తహసీల్దార్ల సేవలు అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, తమకు నచ్చిన వ్యాపకాలతో మానసిక ప్రశాంతతతో కూడిన ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పదవీ విరమణ పొందిన తహసిల్దార్లను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు టి.ఎల్.సంగీత, ఆర్.పాండు, సంగారెడ్డి తాహసిల్దార్ జయరాం నాయక్, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, తహసీల్దార్లు, రెవిన్యూ అధికారుల సంఘం కార్యదర్శి మన్నె కిరణ్ కుమార్, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
