ఏలూరు/వేలేరుపాడు, ఆంధ్రప్రభ బ్యూరో : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి చెక్కుల పంపిణీ నిమిత్తం శనివారం వేలేరుపాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతను, నిర్వాసితుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని కొనియాడారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మలమాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలన పోలవరం ప్రాజెక్టును, నిర్వాసితులను పూర్తిగా విధ్వంసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. నిధులు వెంటనే జమ చేయండిపోలవరం ప్రాజెక్టుకు భూసేకరణ, నిర్వాసితుల నిమిత్తం వెయ్యి కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను చెప్పినప్పుడు, స్పందించి ఇచ్చిన ఆదేశాలను మంత్రి రామానాయుడు గుర్తు చేశారు.
“సీఎఫ్‌ఎంఎస్ నుంచి నిధి పోర్టల్ ద్వారా అప్‌లోడ్ చేయడానికి వారం రోజులు సమయం పడుతుంది. మళ్లీ నేను వచ్చేంత వరకు మీరు వేచి చూసే అవసరం లేదు. ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా మీరే వెళ్లి వారి ఖాతాల్లో నిధులు జమ చేయండి. సాయం అందడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు” అని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అందరూ ధన్యవాదాలు తెలియజేయాలన్నారు.
కూటమి ప్రభుత్వంలో నిర్వాసితులకు అండ
పోలవరాన్ని మళ్లీ నిర్మాణ గాడిలో పెట్టి, నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతతో, పవన్ కళ్యాణ్ అండతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితుల చిరకాల కోరిక నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
భూసేకరణలో వేగం
ఫేస్ 141.15 కాంటూర్ ఈ కాంటూర్‌కు సంబంధించి 1 లక్ష 9 వేల ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉండగా, ఇప్పటికే 86,985 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామని, అంటే దాదాపు 87% పూర్తి చేశామని మంత్రి తెలిపారు.ఫేస్ 245.72 కాంటూర్ ఈ కాంటూర్‌కు సంబంధించి 67,662 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉండగా, కూటమి ప్రభుత్వం ఇప్పటికే 29,727 ఎకరాలు (సుమారు 44%భూసేకరణ పూర్తి చేసిందని వివరించారు.
నష్టపరిహారం (ఆర్ అండ్ ఆర్) చెల్లింపు……
ఫేస్ 1-41.15 కాంటూర్ కు సంబంధించి 3,860 మంది నిర్వాసిత కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు 19,954 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందించడం జరిగింది. మిగిలిన నిర్వాసితులందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. 2016 సంవత్సరంలో రూ. 700 కోట్లు నిర్వాసితుల అకౌంట్లో జమ చేశామని.2025 జనవరిలో రూ. 900 కోట్లు అకౌంట్‌లో జమ చేశామని.
మళ్లీ ఈరోజు, నవంబర్ 1, 2025 నుంచి రూ.1,000 కోట్లు నిర్వాసితుల అకౌంట్లో జమ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా ఏ నిర్వాసితుల ఎకౌంట్‌లో కూడా జరగనటువంటి పరిస్థితి. మానవత్వం లేని ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి” అని మంత్రి విమర్శించారు.
కాలనీల నిర్మాణంలో వేగం….
నిర్వాసితులకు పరిహారం ఇవ్వడమే కాకుండా, పునరావాసం కింద కాలనీ నిర్మాణం చేయాలని, అందులో రోడ్లు, డ్రైన్స్, అంగన్వాడీ, ఎలిమెంటరీ స్కూల్స్, పీహెచ్‌సీ హాస్పిటల్స్, గ్రౌండ్స్ వంటి సమస్త సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి పేర్కొన్నారు. 2014-19 టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2017లో ఐడెంటి ఫై చేసిన 20,946 కుటుంబాలకు 75 కాలనీలను ఏర్పాటు చేయడానికి మొదలుపెట్టి, 26 కాలనీలను పూర్తి చేసింది.
ఇంకా 49 కాలనీలు నిర్మాణం చేయవలసి ఉంది. గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి బడ్జెట్ కూడా తీయలేదు. తెలుగుదేశం కట్టిన కాలనీలను కూడా పట్టించుకోలేదు. అని మంత్రి విమర్శించారు. మిగిలిన 49 కాలనీలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొన్ననే రూ. 739 కోట్ల అంచనాతో టెండర్లను కూడా పిలుస్తున్నామని మంత్రి తెలిపారు. 2025 డిసెంబర్ కల్లా ఆ టెండర్లను ఓపెన్ చేసి పనులు ప్రారంభించి, 2026 మే నెల కల్లా ఆ 49 కాలనీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఈ కాలనీలు పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేసిందని, ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఆలోచన ఎందుకు రాలేదని మంత్రి ప్రశ్నించారు. అలాగే, 2022లో కూడా ఆధార్ సర్వే ద్వారా ఐడెంటిఫై చేసిన 17,114 కుటుంబాలకు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసి, కాలనీలు ఏర్పాటు చేసి, ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలనే ఆలోచన కూడా జగన్ ప్రభుత్వం చేయలేదని మంత్రి విమర్శించారు.
వైసీపీ పాలనలోనే పోలవరం విధ్వంసం
పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక వరం అని మంత్రి రామానాయుడు అభివర్ణించారు.2014-19 టీడీపీ ప్రభుత్వ సారథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును72% పూర్తి చేసి, ప్రతి సోమవారం పోలవరం పర్యవేక్షణ పూర్తి చేశారని తెలిపారు. అయితే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కేవలం 2% మాత్రమే ప్రాజెక్టు పూర్తయినట్టు పేపర్ మీద చూపించిందని, కానీ వాస్తవంగా చూస్తే పోలవరం ప్రాజెక్టును 20 నుంచి 30 సంవత్సరాలు వెనక్కి నెట్టిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారని, 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్‌ను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు.
నిర్వాసితులకు జగన్ దగా
పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేయడమే కాదు, ప్రాజెక్టు కోసం భూమి త్యాగం చేసినటువంటినిర్వాసితులను కూడా గత ఐదేళ్ల ప్రభుత్వం గాలికొదిలేసి, మోసం చేసిందని మంత్రి రామానాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలవరం విధ్వంసం చేయడమే కాదు, పోలవరం నిర్వాసితులకు చేసినటువంటి ద్రోహి, దగా ఆరోజు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి నిమ్మల గుర్తు చేశారు.
నిర్వాసితులకు 58 వేల ఇళ్లు ఇస్తాం : మంత్రి పార్థసారథి
పోలవరం నిర్వాసితుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవత్వంతో వ్యవహరిస్తున్నారని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే, పోలవరం నిర్వాసితుల కోసం 58 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ, రాబోయే రోజుల్లో మిగిలిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. మానవత్వంతో సహాయం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి చెక్కుల పంపిణీలో ఏమాత్రం ఆలస్యం జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
పోలవరం పూర్తే లక్ష్యం : మంత్రి నాదెండ్ల మనోహర్
పోలవరం నిర్వాసితుల త్యాగాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు ప్రాజెక్టు వల్ల నష్టపోయిన నిర్వాసితులకు పరిహారంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించి, వారి జీవితాలు మెరుగుపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఉమ్మడిగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష, జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీప్రసాద్ ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు, సహా పలువురు సంస్థల చైర్మన్లు, టీడీపీ మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్ తదితర నాయకులు, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.

