యూరియా బస్తాల కోసం రోడ్డెక్కిన రైతన్నలు
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా అందలేదని ఆవేదన
గాంధారి, ఆంధ్రప్రభ: ఆన్‌లైన్ యాప్‌లో యూరియా బస్తాలను బుక్ చేసుకున్నప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డెక్కిన ఘటన గాంధారి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. యూరియా కోసం సుమారు 50 మంది రైతులు కామారెడ్డి–బాన్సువాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ విక్రయ యాప్ ద్వారా యూరియా, డీఏపీ వంటి ఎరువులను రైతులకు అందిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం గాంధారి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో యాప్‌లో 1,300 యూరియా బస్తాలను వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంచారు.
దీంతో మండలంలోని పలువురు రైతులు యాప్ ద్వారా యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రైతులు మంగళవారం యూరియా బస్తాలను తీసుకునేందుకు గాంధారి సింగిల్ విండో కార్యాలయానికి తరలివచ్చారు. అయితే ముందుగా వచ్చిన కొందరు రైతులకు యూరియా బస్తాలు లభించగా, ఆలస్యంగా వచ్చిన పలువురు రైతులకు బస్తాలు అందలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుమారు 50 మంది రైతులు కామారెడ్డి–బాన్సువాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి రాజలింగం అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్ విక్రయ యాప్‌లో సాంకేతిక లోపం కారణంగా అందుబాటులో ఉంచిన యూరియా బస్తాల కంటే అదనంగా బస్తాలు బుక్ అయినట్లు తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులకు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా రైతులకు పారదర్శకంగా యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
