ఢిల్లీ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర భారీ పారిశ్రామిక, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన బయ్యారం ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ అభివృద్ధికి ఉక్కు పరిశ్రమ కీలకమని, ముఖ్యంగా బయ్యారం ప్రాంతంలో లభ్యమవుతున్న సహజ వనరులు, ఇనుప ఖనిజ సంపదను సద్వినియోగం చేస్తే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తుమ్మల వివరించారు. పల్లె ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు, పలు అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అంశంపై త్వరలో సమగ్ర సమావేశం ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు.

