Disability Pension India |దివ్యాంగులకు కేంద్రం గుడ్న్యూస్.. పింఛను పెంపు, అర్హతల్లో మార్పులు!
- రూ.53,428 కోట్లతో ఐదేళ్ల పాటు సామాజిక భద్రతా పథకం కొనసాగింపు
- 3.20 కోట్ల మందికి ప్రయోజనం
- 80 శాతం వైకల్య పరిమితి 40 శాతానికి తగ్గింపు
- 2026-27 నుంచి 2030-31 వరకు అమలు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించే జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఈ పథకం అమలుకు రూ.53,428 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా దివ్యాంగుల పింఛను అర్హత నిబంధనలను సడలిస్తూ, ఆర్థిక సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
దివ్యాంగుల పింఛను పెంపు
కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం, దివ్యాంగుల పింఛను పథకాన్ని ‘ప్రధానమంత్రి దివ్యాంగ పింఛను యోజన’గా మార్చనున్నారు. ఈ పథకం కింద 79 ఏళ్లలోపు అర్హులైన లబ్ధిదారులకు నెలవారీ కేంద్ర సాయాన్ని రూ.200 నుంచి రూ.375కు, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 నుంచి రూ.625కు పెంచనున్నారు. తద్వారా అర్హులైన దివ్యాంగులకు గతంలో కంటే అదనపు ఆర్థిక సహాయం అందనుంది.
80 శాతం నుంచి 40 శాతానికి వైకల్య పరిమితి
దివ్యాంగుల పింఛను పొందేందుకు ఇప్పటివరకు ఉన్న వైకల్య శాతం నిబంధనల్లోనూ కేంద్రం మార్పులు చేసింది. అర్హతకు అవసరమైన కనీస వైకల్య పరిమితిని 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. అంటే, ప్రామాణిక వైకల్యం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న అర్హులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. సవరించిన నిబంధనల ప్రకారం, అర్హతకు సంబంధించిన కనీస వయోపరిమితిని పుట్టుక నుంచే వర్తించేలా మార్చనున్నారు. దీనివల్ల అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న చిన్నారులు కూడా పథకం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలు
పింఛను అర్హత, లబ్ధిదారుల సంఖ్య, ఆర్థిక సాయం రేట్లలో చేసిన మార్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లోగా కొత్త మార్గదర్శకాలను జారీ చేయనుంది. వాటి ఆధారంగా పథకం అమలులో మార్పులు చేపట్టనున్నారు. కొత్త నిబంధనల అమలుతో మరింత మంది అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
పింఛను పథకాలకు కొత్త పేర్లు
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం పేరును ‘ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజన’గా మార్చనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న పలు పథకాలకు కొత్త పేర్లు పెట్టాలని నిర్ణయించారు. అయితే, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, జాతీయ కుటుంబ ప్రయోజన పథకాల ప్రస్తుత విధానం కొనసాగనుంది.
ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకాన్ని ‘ప్రధానమంత్రి వృద్ధావస్థ పింఛను యోజన’గా, ఇందిరా గాంధీ జాతీయ వితంతు పింఛను పథకాన్ని ‘ప్రధానమంత్రి విధవా పింఛను యోజన’గా మార్చనున్నారు. అలాగే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ‘ప్రధానమంత్రి పరివార్ లాభ్ యోజన’గా మారనుంది.
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 1995 ఆగస్టు 15న ప్రారంభించారు. పేద కుటుంబాలకు వృద్ధాప్యం, వితంతుత్వం, దివ్యాంగత్వం వంటి పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. రాజ్యాంగంలోని నిర్దేశక సూత్రాల్లో భాగమైన 41వ అధికరణం స్ఫూర్తితో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులను సమకూరుస్తోంది. దేశవ్యాప్తంగా అర్హులైన పేదలకు కనీస సామాజిక సహాయం అందుబాటులో ఉండేలా ఈ విధానం రూపొందించారు.
దివ్యాంగుల హక్కుల చట్టానికి అనుగుణంగా..
దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం, ప్రామాణిక వైకల్యం కలిగిన వ్యక్తులకు సంక్షేమ ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పింఛను అర్హత పరిమితిని 40 శాతానికి తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. అలాగే, ఇతర వర్గాలకు అందించే తులనాత్మక పథకాలతో పోలిస్తే దివ్యాంగులకు అందించే సహాయం కనీసం 25 శాతం ఎక్కువగా ఉండాలనే నిబంధనను కూడా ప్రభుత్వం ప్రస్తావించింది.
