dharna| కొడుకు, కోడలు గేంటేశారని కన్నీళ్లు
కొడుకు ఇంటి ముందే తల్లిదండ్రుల ధర్నా..
ఇల్లు అమ్మకానికి పెట్టారని ఆరోపణ
తమను ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన
కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదంటూ నిరసన..
న్యాయం చేయాలని వేడుకోలు
కడుపున పెట్టుకుని పెంచిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కొడుకే దూరమయ్యాడన్న ఆవేదన.. సొంతింట్లోనే తమకు చోటు లేకుండా పోయిందంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. న్యాయం కోసం కొడుకు ఇంటి ముందు నిలబడి తమ గోడును వెళ్లబోసుకున్న తీరు పలువురిని కలచివేసింది.
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కన్న కొడుకు ఇంటి ముందే వృద్ధ తల్లిదండ్రులు ధర్నాకు దిగిన ఘటన మియాపూర్‌లోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో చోటుచేసుకుంది. తమను ఇంటి నుంచి బయటకు పంపించారని, కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

తమకు తెలియకుండానే తమ ఇల్లును విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దంపతులు ఆరోపించారు. కొడుకు, కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత ఇంటి విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.
ఇంటి నుంచి గెంటివేయడం, ఆస్తి విక్రయానికి ప్రయత్నించడం వంటి చర్యలతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు పేర్కొన్నారు. తమ సమస్యను అధికారులు, పోలీసులు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
