మారుపేర్ల డిపెండెంట్ల ధర్నా
గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు పరిశ్రమ (Singareni Collieries) లో దశాబ్దాల పాటు పనిచేసిన కార్మికుల వారసుల ఉద్యోగాల వ్యవహారం రోజురోజుకు రచ్చకెక్కుతోంది. సింగరేణి ((Singareni) గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ తమ జీవితాలతో ఆటలాడుకోవద్దని విలపించారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాస్కర రావు భవన్ (ఏఐటీయూసీ కార్యాలయం) ఎదుట ధర్నా చేపట్టారు. మారుపేర్ల వారసుల డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించి న్యాయం చేసే విషయంలో సింగరేణి గుర్తింపు సంఘం మొండి వైఖరి అవలంబిస్తుందని వారసులు ఆరోపించారు. విజిలెన్స్ లో పెండింగ్‌లో ఉన్న మారుపేరుల కేసును త్వరగా పరిష్కరించడంలో నిర్లక్ష్యం జరుగుతుందని మండిపడ్డారు. ఏఐటీయూసీ కార్యాలయం (AITUC Office) ముందు వారసులంతా బైఠాయించారు. గుర్తింపు సంఘాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆందోళనకారులతో చర్చలు..
ధర్నా అనంతరం సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య (Vasireddy Seetharamaiah) ను బాధితులు కలిశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరుతానని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించే విషయంలో మారుపేరుల వారసులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపారు. ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారంటూ సీతారామయ్యను వారసులు ప్రశ్నించారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సమస్యను పరిష్కరించాలని సింగరేణి గుర్తింపు సంఘం నేత వాసిరెడ్డి సీతారామయ్య ముందు మొరపెట్టుకున్నారు. ఐఎన్టీయూసీ నేతలు (INTUC leaders) ఉసిగొలిపితే తమ కార్యాలయం ముందు ఆందోళన చేయడం సరికాదని సీతారామయ్య ఈ సందర్భంగా స్పష్టం చేయడంతో… అలాంటి అవసరం తమకు లేదని న్యాయం మాత్రమే చేయాలని కోరుతున్నామని బాధితులు (victims) వివరించారు. తమ జీవితాలతో ఆటలాడుకోవద్దనీ…తమకు న్యాయం చేయాలంటూ సింగరేణి గుర్తింపు సంఘం నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య కాళ్ళను మొక్కారు. మారుపేరుల బాధితులు కొద్దిసేపు గుర్తింపు సంఘం నాయకులతో వాదనకు దిగారు. సింగరేణిలో పెండింగ్ లో ఉన్న విజిలెన్స్ మారుపేర్ల కేసు ఎత్తివేయాలనీ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తలుచుకుంటే పరిష్కారం : సీతారామయ్య
సింగరేణి బొగ్గు పరిశ్రమలో పెండింగ్‌లో ఉన్న మారుపేరుల వారసుల డిపెండెంట్ ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) తలుచుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. తమ వంతుగా సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనుల నిర్మాణంతోపాటు పలు అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం వెళ్తే సమయం ఇవ్వడం లేదని సీతారామయ్య పేర్కొన్నారు. స్ట్రక్చర్ మీటింగ్ (Structure meeting)తో మారుపేర్ల సమస్యను ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐ ఎన్ టి యు సి ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రితో అడ్వకేట్ జనరల్ కు చెప్పించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుందని సీతారామయ్య సూచించారు.


