DGCA | విమాన భద్రత పెంపే లక్ష్యం…
వచ్చే ఏడాది జులై నాటికి పరీక్షలు పూర్తి చేయాలని డీజీసీఏ ఆదేశాలు
DGCA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విమాన ప్రయాణాల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న పైలట్లకు డ్రగ్ టెస్టులు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జులై నాటికి ఈ పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించినట్లు సమాచారం.
ఇటీవల ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమాన ఘటన నేపథ్యంలో డీజీసీఏ ఈ చర్యలు చేపట్టింది. ఆ ఘటనలో విమానం అకస్మాత్తుగా కిందకు పడిపోవడం, అనంతరం పైలట్ డ్రగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పైలట్ల శారీరక, మానసిక సామర్థ్యాలను నిర్ధారించడంతో పాటు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విమాన కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించే సిబ్బందిపై డ్రగ్ వినియోగ నియంత్రణకు ఇప్పటికే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.
దేశంలోని అన్ని విమానయాన సంస్థలు తమ పైలట్లకు నిర్దేశిత గడువులో డ్రగ్ పరీక్షలు నిర్వహించి, సంబంధిత వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ చర్యల ద్వారా విమాన సిబ్బంది ఫిట్నెస్ను మరింత సమర్థంగా పర్యవేక్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
