Tuesday, November 12, 2024

…యాజ్ఞవల్క్యుడు

శ్లో: వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహమ్‌, యాజ్ఞవల్క్యం ముని శ్రేష్ఠం జిష్ణుం హరి హర ప్రభుమ్‌,
శ్లో: జితేంద్రియం జితక్రోధం సదా ధ్యాన పరాయణమ్‌, ఆనందనిలయం వందే యోగానంద మనీశ్వరమ్‌బీ
శ్లో: ఏవం ద్వాదశ నామాని త్రికాలే య: పఠే న్నర:బీ యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్‌ ధనవాన్‌ భవేత్‌…

యాజ్ఞవల్క్య మహర్షి ప్రాచీన వేద భారతావనిలో ప్రముఖుడు. ఉపనిషత్తుల్లో ముఖ్యంగా కనిపించే యాజ్ఞ వల్క్యుడు శతపథ బ్రాహ్మణం (బృహదారణ్య కోపనిషత్తు సహా), యాజ్ఞవల్క్య సంహిత, యాజ్ఞవల్క్య స్మృతి రచించాడు. పూర్వం కురుపాంచాల దేశంలో గంగానదీ తీరాన చమత్కార పురం అనే నగరంలో ఉండే యజ్ఞవల్క్యుడు అనే మహర్షి, ఆయన భార్య సునందలకు జన్మించినవాడే యాజ్ఞ వల్క్యుడు. యాజ్ఞవల్క్యుడు భాష్కలుడి దగ్గర రుగ్వేదాన్ని, జైమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అధర్వణ వేదాన్ని నేర్చుకున్నాడు. వైశంపాయన మహర్షి దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి అహంకారం, విద్యామదం లాంటివి కలిగాయి. ఆ విషయాన్ని గురువు గ్రహించాడు. యాజ్ఞవల్క్యుడిలో నానాటికీ విద్యామదం అధికం అయింది. అది ఆత్మాభిమానమని యాజ్ఞవల్క్యుడు అనుకున్నాడు. ఓ రోజున వైశంపాయనుడు తన మేనల్లుడు అధర్మమార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని కోపం పట్టలేక కాలితో అతడిని తన్నాడు. బ్రాహ్మణుడిని కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపాయనుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదన పడసాగాడు. ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు గురువు దగ్గరగా వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తనవల్ల తప్ప మరెవరివల్లా కాదని గర్వంగా అన్నాడు. తనపాపం పోవటం అటుంచి అంతటి కష్టకాలంలోను శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువుకు కోపం తెప్పించింది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని, అప్పటిదాకా నేర్పిన వాటి నన్నింటినీ కక్కి (ఏవీ గుర్తుంచు కోకుండా మరిచిపోయి) వెళ్ళిపొమ్మని అన్నాడు. గురు ద్రోహానికి అదే తగిన శిక్ష అని అన్నాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభావాన్ని కలిగివున్నానని తెలుసు కొన్నాడు. క్షమించమని గురువును వేడుకొన్నా లాభం లేకపోయింది. అయితే తనవంతు బాధ్యతగా యాజ్ఞవల్క్యుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకొన్న వేదాలను అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళి పోయాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్క్యుడు విసర్జించినదాన్ని కొన్ని తిత్తిరి పక్షులు గ్ర#హంచి, అవి తిరిగి ఆ వేదసారాన్ని పలికిన పలుకులే తైత్తిరీయోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి.

గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞవల్క్యుడు ఆత్మస్థ్తెర్యంతో సూర్య భగవానుడిని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్ల యజు ర్వేదాన్ని నేర్చుకున్నాడు. తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలూ అభ్యసించాడు. ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్క్యుడు పేరు తెచ్చుకున్నాడు. కణ్వుడు లాంటి ఉత్తమ శిష్యులు ఆయనదగ్గర శిక్షణ పొందాడు.
ఆ రోజుల్లో కతుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే పేరున్న కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యుడి కిచ్చి పెళ్ళిచేశారు పెద్దలు. అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె, పండితురాలైన గార్గి అనే ఆమె శిష్యురాలు అయిన మైత్రేయి యాజ్ఞవల్క్యుడిని వివాహ మాడాలని పట్టుబట్టింది. అప్పటికే అతడికి కాత్యాయనితో వివాహం కావటంతో పెద్దలకు ఏంచేయాలో అర్థంకాలేదు. గార్గి ఈ సమస్యకు సమాధానాన్ని వెతికింది. మైత్రేయిని కాత్యాయనికి పరిచయం చేసి ఆ ఇద్దరూ ఎంతో స్నే#హంగా ఉండేలా చేసింది.
కాత్యాయని, మైత్రేయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పింది. కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవల్క్యుడితో వివాహాన్ని జరిపించింది. అలా యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలయ్యారు. రుషులంతా యాజ్ఞవల్క్యుడిలోని విద్యా వైభవాన్ని, యోగ ప్రాభవాన్ని గుర్తించి మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. అతను బుషులకు తెలియజేసిన విషయాలే యోగశ్రాస్తమని యోగ యాజ్ఞవల్క్యమనీ ప్రసిద్ధికెక్కాయి. యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వమునుపదేశించి సన్యసించాడు. ఆయన పేర ఒక స్మృతి ఉంది.

  • రామకిష్టయ్య సంగనభట్ల…

Advertisement

తాజా వార్తలు

Advertisement