Monday, November 25, 2024

మాట… చక్కని కళ!

సంభాషణలలో చాలా రకాలు ఉన్నాయి. హితభాషణం, మితభాషణం, స్మితభాషణం, ప్రియభాషణం, పూర్వభాషణం ఇలా చాలావిధాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే మనిషి వద్ద వుంటే అతని చెంతనే మనకు ఉండాలని పిస్తుంది. హితభాషణం అన్నిటిలోకి చాలా కష్టమైన విధానం. అవతలివాడికి హితం చెప్పటం. అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే, సలహాలు ఎవరూ సంతోషంగా స్వీకరించరు. అనవసరంగా, అతిగా మాట్లాడితే అపార్థాలు రావటానికి చాలా అవకాశాలు వున్నాయి. అందువల్ల బాగా ఆలోచించి క్లుప్తంగా మాట్లాడటం నేర్చుకోవాలి. స్మితభాషణం మాట్లాడే విషయాన్ని చిరునవ్వుతో మాట్లాడటం స్మితభాషణం. పళ్ళు కనపడకుండా నవ్వటమే ‘స్మితం’. అలా ఏ విషయాన్నయినా కూడా నవ్వుతూ చెప్పగలగాలి. ప్రియభాషణం, ప్రియభాషణలో కొన్ని అసత్యాలు ఉండే అవకాశంవుంది. అయితే, కొన్ని సందర్భాల్లో అవి చాలా తప్పనిసరి. ఇతరుల మనసు బాధపెట్టకుండా ప్రియంగా మాట్లాడటం చాలా కష్టమైన పని. ఒక్కోసారి అవతలివారికి తెలిసిపోయే ప్రమాదం కూడా వుంది. పూర్వభాషణం… అవతలి మనిషితో ముందుగా మనమే మాట్లాడటమే పూర్వభాషణం. అవతలి మనిషి మనకన్నా గొప్పవాడా, చిన్నవాడా అని చూడకుండా పలకరించటం చాలా గొప్ప సుగుణం. సంభాషణం ఒక గొప్ప భూషణం. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం. ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతాం. అనవసరంగా మాట్లాడితే అపార్థాలకు తావిస్తాం, స్నేహితులను కోల్పోతాం. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం. అసత్యం మాట్లాడితే శీలాన్ని కోల్పోతాం. ఆలోచించి మాట్లాడితే వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను కాపాడుకుంటాం.
మాటలలో చాలా రకాలుంటాయి. మంచి మాటలు, చెడు మాటలు. చెడు మాటలు నాలుగు విధాలుగా ఉంటాయి. పారుష్యం అనగా కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దు:ఖం కలుగుతుంది. అనృతం అనగా అసత్యం చెప్పడం. దీనివలన ఆత్మ, మనస్సు కలుషితమవుతాయి. అసత్యవాదులు జీవించినా మరణించినవారితో సమానమని వేదోక్తి. పైశున్యం అనగా చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాలలో కలహాలు, సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం అసూయ, అసహనం ఏర్పడతాయి. ఇతరులనుండి అవమానాల్ని, అవహేళనల్ని పొందాల్సి వుంటుంది. వీరు సాంఘిక జీవనం కోల్పోతారు. అసందర్భ ప్రలాపం… అనవసరంగా, అసందర్భంగా వ్యర్థంగా మాట్లాడకూడదు. ఎడతెగకుండా మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకుపుడుతుంది.
మాట లేకుంటే చోటే లేదన్నది ఓ సామెత. ఆ చోటన్నది ఊళ్లో అయినా.. ఎదుటివాళ్ల గుండెల్లోనైనా! మనిషి సంగతి చెప్పేది మాటే. మన సంభాషణ ఆసక్తికరంగా ఉంటేనే ఎదుటివారు మనతో సంభాషించటానికి ఇష్టపడతారు. లేదంటే మనతో సంబంధాన్ని, స్నేహాన్ని తుంచేసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేముందు మనతో మనం మాట్లాడుకోవాలి. ప్రతిరోజూ మీరు మీతో మాట్లాడుతూ మీరు చేసే పనులను, ఫలితాలను చర్చించుకుంటూ మిమ్మల్ని మీరు బాగా తెలుసుకున్నపుడే ఎదుటివారితో బాగా సంబంధ బాంధవ్యాలని కొనసాగించగలరు.

  • తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి.
Advertisement

తాజా వార్తలు

Advertisement