Friday, November 29, 2024

శృంగేరీ విధుశేఖరుని తేజస్సుతో సామవేదం వల్లభ గణపతికి జోతలు సమర్పణ !

పురాణపండ ‘ శివశ్శివమ్ ‘ గ్రంధం ఆవిష్కరణ !!

రాజమహేంద్రవరం : దక్షిణామ్నాయ శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ మహా స్వామి రాకతో శంకర… శంకర మంగళ శబ్దాలతో , పరమ పవిత్ర వేద గానాలతో ఉభయగోదావరి జిల్లాలూ గత వారం రోజులుగా రమణీయంగా , కమనీయంగా , దివ్యంగా భక్తిమయంగా పులకించిపోయాయనే చెప్పాలని వందల ఆలయాల అర్చకులు, వేద పండితులు , సౌజన్యమూర్తులు ముక్త కంఠంతో చెబుతున్నారు.

దశాబ్దాలనాడు శృంగేరీ పీఠాధిపతులు శ్రీ భారతీతీర్థ స్వామి వచ్చినప్పుడు ఎంతటి ఘనంగా శ్రీకార్యాలు నిర్వహించారో … అంతే ఘనంగా పవిత్రమయంగా ఈ సారి శ్రీ విధుశేఖర భారతీ మహా స్వామి రాకకు స్పందించిన గోదావరీ తీర ప్రముఖులు అద్భుతంగా పవిత్ర కార్యాలు నిర్వహించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది అనిర్వచనీయ అనుభూతిగా మిగుల్చుకోవడం ఈసారి విశేషంగా చెప్పాల్సిందే.

శ్రీ విధుశేఖర భారతీ స్వామి పర్యటనలో చివరి రోజైన శుక్రవారం నాడు రాజమహేంద్రవరం లో అద్భుత ఘట్టాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారతీయ సంస్కృతికి ప్రతీకగా, సనాతన ధర్మానికి ఒక పవిత్ర పతాకంగా లక్షల తెలుగువారిని తమ ఉపన్యాసాలతో ఉర్రూతలూగిస్తున్న ఋషిపీఠం సంపాదకులు సామవేదం షణ్ముఖ శర్మ బొమ్మూరులో స్థాపించిన శ్రీ వల్లభ గణపతి దేవాలయాన్ని సందర్శించి , ఆ ఆలయంలో గణపతికి మంగళార్చనలు నిర్వహించి … షణ్ముఖ శర్మ పూజ్య భావనపై , వైదిక భావనలపై ఆప్యాయతను వర్షించడం ఈ పర్యటనలో ఒక అపూర్వ ఘటనగా పండితులు పేర్కొంటున్నారు.

- Advertisement -

మరొక ముఖ్యాంశం ఏమంటే … తర తరాల పురాణపండ వారి ఈతరం ప్రతినిధి , ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనం ‘ శివశ్శివమ్ ‘ మహా సాధనా గ్రంధాన్ని శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి పవిత్ర హస్తాలతో ఆవిష్కరించడమే కాకుండా … ప్రతీ పేజీని ఎంతో ఆసక్తిగా పరిశీలించి శ్రీనివాస్ దైవీయ చైతన్యంపై మంగళాలను శుభదృష్టితో వర్షించడం స్వామివారి గోదావరి జిల్లాల పర్యటనలో ఆఖ్రి రోజు అద్భుతంగా పండిత వర్గాలు, మేధో సమాజం భావించింది.

జీవన యాత్రలో పలు సవాళ్ళను ఎదుర్కొన్న పురాణపండ శ్రీనివాస్ నిర్భయ చైతన్యంతో, నిస్వార్ధంగా చేస్తున్న అప్రతిహత పుస్తక జైత్రయాత్ర గత దశాబ్ద కాలంగా దేశాల ఎల్లలు దాటి లక్షల అభిమానుల్ని శ్రీనివాస్ మనస్సుకి దగ్గర చేసింది . ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క తేనెపట్టులా ఆకర్షించి దైవీయ స్పృహతో అద్భుతాల్ని ఆవిష్కరించడంలో, నాణ్యతా ప్రమాణాల ముద్రణలో అందెవేసిన చెయ్యిలా స్వామీజీ ప్రక్కనే ఉన్న పండితులు విధుశేఖర భారతికి చెప్పడం …. స్వామీజీ తన పవిత్ర హస్తాలతో అక్కడి ఉన్నతాధికారులకు, పండిత బృందాలకు పంచడం ఒక అందమైన జ్ఞాపకంగా పేర్కొనడం పేర్కొంటున్నారు.

వ్యాపార స్వార్ధాలు పెరిగిన ఈరోజుల్లో ఇంతటి అందమైన శివశబ్దాల పుస్తకాన్ని దివ్యమైన సేవగా అందించిన పురాణపండ ను అక్కడే పలువురు ప్రశంసించడం కనిపించింది. శృంగేరీ స్వామి వారి విజయయాత్రలో భక్తులకు ఈ ‘ శివశ్శివమ్ ‘ రసవత్ఘట్టం ఒక మరపురాని అద్భుతమైంది.

నగర ప్రముఖలు చెన్నాప్రగడ శ్రీనివాస్ ఈ గ్రంధాలని స్వామివారికి అందజేసి దివ్యాశీస్సులు అందుకోవడం విశేషం. అనేకమంది భక్తులకు జ్ఞానసరస్వతీ ట్రస్ట్ ట్రస్ట్ తోట సుబ్బారావు పర్యవేక్షణలో ఈ వర్ణమయ గ్రంధాన్ని ఉచితంగా పంచారు. ఇలాంటి మహా కార్యాలను సమర్పించిన స్వామివారి ఆహ్వాన కమిటీ ని అందరూ అభినందించారు. అయితే పురాణపండ శ్రీనివాస్ బెంగళూరులో ఉపన్యాసాల కారణంగా రాలేకపోయారని స్వామీజీకి విన్నవించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement