Tuesday, November 26, 2024

శివుడు సర్పాన్ని మెడలో ఎందుకు ధరించాడు

పరమేశ్వరుని మెడలో నాగాభరణమై వున్న మహాసర్పం వాసుకి. అన్నివేళలా స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు. కశ్యప ప్రజాపతికి గల 14 పత్నుల్లో వినత, కద్రువలు ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు ఇద్దరు కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహస్తుంటాడు. కద్రువకు వెయ్యి మంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాల సముద్రం సమీ పంలోని ఉచ్చ్కె శ్రవాన్ని (గుర్రం) దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా వుందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే వుంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా వుంటే అక్క తన దగ్గర వేయి సంవత్స రాలు పరిచారికగా వుండాలని ఒకవేళ తోక తెల్లగానే వుంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా వుంటానని కద్రువ పందెం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షి స్తామని వెళ్లిపోతారు. గుర్రంతోక తెల్లగానే వుంది ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ వుంటుంది. హఠాత్తుగా ఆమెకో ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా వున్న వారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాది స్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించు కోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని శపిస్తుం ది. ఈ శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్నమాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు.
తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీమహా విష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషు వును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యు భయం లేకుండా పోయింది. రెండో వాడైన వాసుకి మహా శివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్య క్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకికి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆనాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శన మిస్తుంటాడు. సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించిన వాడు కనుకనే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూష ణుడు అని కూడా పిలుస్తాము.
ఓం నమ: పార్వతీ పతే నమో నమ:
– డా|| చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement