శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం ఏమిటి?
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. ఈ విధంగా సృష్టి, స్థితి, లయములను బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల పేర్లతో రజో, సత్వ, తమో గుణములతో ప్రవర్తింప చేసేవాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. మూడు గుణాలతో, మూడు రూపాలతో, మూడు పేర్లతో, మూడు కార్యాలు చెసినా సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. అందుకే అన్ని పురాణాలు, ఇతిహాసాలు, ధర్మ శాస్త్రాలు రక్షణ గురించే వివరించాయి. పరమాత్మ శ్రీమన్నారాయణుడు లోకాలను రక్షించడానికి సుర, నర, తిర్యక్(పశువులు) రూపాలలో అవతరించాడు. ఈ అవతారాలలో అనంత కోటి బ్రహ్మాండాలను రక్షించాడు. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్షా: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. అందులో మొదటిది సనకాది ఋషులు. ఈ వరసలో ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి