Tuesday, November 12, 2024

సనాతన ధర్మం అంటే?

ఏ ఆహారం తాను స్వయంగా పండించుకొని, లేదా ప్రకృతి నుండి కందమూలాలు, ఆకులు, కాయలు. పండ్లను సేకరించుకొని, జంతువులను, పశువులను మచ్చిక చేసుకొని, పాలు సేకరించుకొని తనకవసరమైన అన్ని వస్తువులను సరుకులను తానే తయారు చేసుకొని, తానే నీరు తెచ్చుకొని తన ఆహారాన్ని తానే వంట చేసుకొని, తన బట్టలు, నార చీరలు తానే నేసుకొని, తన గుడిసె… పర్ణశాలను తానే కట్టుకొని, అమ్ముడు, కొనుడు అనే పద్ధతి పుట్టని, అనగా మారకం, వ్యాపారం లేని, డబ్బు ప్రమేయం లేని, స్వయం పోషకంగా ప్రకృతిలో భాగంగా జీవించడం! అట్లా జీవించే వ్యవస్థే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో డబ్బు లేదు. డబ్బు అనేదే పుట్టలేదు. ఇతరుల మీద ఆధారపడి బతికేది సనాతన ధర్మం కాదు. అది పరాన్న భుక్కు జీవితం, అది మారకపు జీవితం. మారకం లేని వ్యవస్థ అంటే కొనడం అమ్మడం, పరస్పరం వస్తువులు ఇవ్వడం తీసుకోవడం అనేది లేని వ్యవస్థ. ఇస్తే దానమివ్వడమే తప్ప అమ్మడం, కొనడం లేని వ్యవస్థ. రాముడు, కృష్ణుడు వంటి రాజులతో మనకు పోలికేమిటి? వారిలా బతకడం మనకెలా సాధ్యం? వాళ్లకు ఎవరో (అనగా ప్రజలు) చేసి పెడతారు. తెచ్చి పెడతారు. లేదా వసూలు చేస్తారు. మనం కష్టజీవులం. మనం పని చేసుకొని, పొట్ట పోసుకుని బతికే జీవితం మనది. మనది మనమే సంపాదించుకోవాలి. మనం కష్టం చేసి రాజులకు కొంత ఇస్తే, వాళ్లు రాజుల్లా బతుకుతారు. అందువల్ల సనాతన ధర్మం అంటే ఒకటి కాదు. స్వయంగా కష్టపడి బతుకుతూ, ఇతరులను, రాజులను కూడా పోషించేవారు. ప్రజలు పని చేస్తే వారి నుండి వసూలు చేసి పరిపాలిస్తూ జీవించే వారు. రాజులు లేక పోయినా ప్రజలు జీవించగలరు. వారు స్వయం పోషకులు. ప్రజలు లేకుండా రాజులు బతక లేరు. కనక రాముడు, కృష్ణుడు వంటి రాజులతో, వాళ్ల రాజ ధర్మంతో మనకు పోలికేమిటి? వాళ్లది రాజ ధర్మం. మనది కష్టజీవుల ధర్మం. సనాతన ధర్మం అంటే రాజులు లేని, డబ్బు పుట్టుక లేని, అమ్ముడు కొనుడు లేని కాలం నాటి ధర్మం. ఎవరికి వారు స్వయంగా పంట పండించుకొని, పశువులను పెంచుకొని, స్వయంగా వంట చేసుకొని ఎవరి మీద ఆధార పడకుండా జీవించడం!! సనాతన ధర్మం అంటే ఇది. ఇపుడున్నది, ఇపుడు నడుస్తున్నది అధునాతన ధర్మం. పరిపాలించే రాజులను ప్రజలే ఎన్నుకునే అధునాతన ధర్మ కాలం ఇది. ఈ కాలంలో సనాతన ధర్మం ఆచరించాలంటే డబ్బును రద్దు చేయాలి. బ్యాంకులు రద్దు కావాలి. #హూటళ్లు రద్దు కావాలి. ఎవరి పంట వారే పండించుకొని తినాలి. అలాంటి వ్యవస్థ రావాలి. అది ఆదర్శవంతమైన సమాజం. అదే ఆధునాతన ధర్మం. అదే సనాతన ధర్మం!! దీన్ని ఆచరించేవారంతా సనాతన ధర్మపరులు. దీనిని ఆచరించేవారు మాత్రమే సనాతన ధర్మపరులు. ఇలా తన ఆహారం తానే పండించుకొని తనకవసరమైనవి తానే తయారు చేసుకొని ఎవరిపై ఆధారపడకుండా బతికినప్పుడు ప్రపంచం అంతటా ఆనందం వెల్లి విరుస్తుంది. దోపిడీ, పీడన అంతరిస్తాయి. వ్యాపారం, మారకం ఉన్నంతకాలం, డబ్బు అనేది ఉన్నంత కాలం ఆధిపత్యం దోపిడీ, అణిచివేత వుంటుంది. అది వున్నంత కాలం అది సనాతన ధర్మం కాదు… రాదు!

  • బి.ఎస్‌.రాములు
Advertisement

తాజా వార్తలు

Advertisement