Tuesday, November 26, 2024

అనేకత్వంలో ఉన్నది ఏకత్వమే!

వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు శ్రీ మన్నా రాయణుడు. శ్రీహరి లోకోద్ధరణకు అనేక అవ తారాలెత్తినాడు. నేటికీ లోకంలో ప్రసిద్ధంగా మనం చెప్పుకునే అవతారాలెత్తినాడు. నేటికీ లోకంలో ప్రసిద్ధిగా మనం చెప్పుకునే అవతారాలు పది. వీటినే దశావతారలని అంటుంటాం. ఆది పురుషుడు భగవం తుడే, ఆయన జన్మాదిరహితుడు అయినప్పటికినీ ప్రతి కల్పంలోనూ తన్నుతానే సృష్టించుకొని, పోషించుకొని సంహరించుకుంటాడు. కానీ ఆయన ఒకరికి జన్మిం చడు. ఒకరిచే సంహరించబడడు. ఇదే విషయం భాగ వతంలో ఇలా ఉన్నది.
శ్లో ”స ఏ ష ఆద్య: పురుష: కల్పేకేల్పేసృజత్యజ:
ఆత్మన్యే వాత్మనాత్మానం- సంయచ్చతి చపాతి చ:” అని
భాగవతంలో శ్రీహరి 23 అవతారాలు ఎత్తినట్లు తెలుప బడింది. వరాహ పురాణంలో 12 అవతారాలు ఎత్తినట్లు తెలుపబడింది. ఏదిఏమైనా లోక ప్రసిద్ధమైన దశావతా రాలు మాత్రమే. శ్రీ మహావిష్ణువు నరసింహావతార మును ప్రశంసిస్తూ, శరణాగతితత్వంతో శేషప్ప కవి తన రచన అయిన నరసింహ శతకంలో తన సందేహాన్ని భగ వంతుని ఇలా ప్రశ్నించాడు ఒక సీస పద్యం ద్వారా.
సీ|| పలుమారు దశ రూపములు ధరించితి వేల?
నేకరూపము బొందవేల నీవు?
నయమున క్షీరాబ్ది నడుమ- జేరితి వేల?
రత్న కాంచన మందిరములు లేవె?
పన్నగేంద్రుని మీద పవ్వళించితి వేల?
జలతారు పట్టె మంచములు లేవె?
ఱక్కలు గల పక్షినెక్కి- సాగితి వేల?
గజతురంగాందోళికములు లేవె?
తే.గీ|| వనజలోచన! ఇటువంటి వైభవములు
సొగసుగా నీకు దోచెనో సుందరాంగ!
భూషణ వికాస- శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూర! అంటూ స్వామీ మీరు పది అవతారలెత్తడమెందుకు? ఒక్క రూపం చాలు కదా! పాల సముద్రం మధ్య కేలపోయావు! రతనాలు పొదిగిన బంగారు భవనాలు లేవా?
పాముపై పవళించావు. జలతారు పట్టెమంచాలున్న వి గదా! పక్షి నెక్కావు గదా! ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు లేవా ఉరేగింపుకు? ఈ సంపదలన్నీ నీకు అందంగా కని పించాయా అని ప్రశ్నించడం కవి భావనలోని ఆంతర్యం ప్రశంసింపదగినదే.
అనేకంగా భాసించే ఈ విశ్వమంతా ఏకాంశలోనే దాగి ఉన్నది. ఈ విషయాన్నే శ్రీ కృష్ణ పరమాత్మ భగవ ద్గీతలో 7వ అధ్యాయంలో ఒక శ్లోకంలో ”మయి సర్వమి దం ప్రోతం- సూత్రే మణిగణాయివ” అంటూ ఈ సమస్త మైన చిద్వస్తువులన్నీ దారంలో పొదగబడిన మణుల వలెనే, అంతర్యామి అయిన నాలోనే కూర్చబడినవి అన్నాడు గీతాచార్యుడు. వివిధ కాలాల్లో ఎన్నో అవతారా లెత్తిన స్వామి వేరువేరుగా అనగా భిన్నభిన్నంగా కన్పిం చినా ఏకైక రూపుడే. బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మరుద్రాది దేవతలు, అవతారాలు అన్నీ ఒకటే నన్నాడు.
గీత పదవ అధ్యాయంలో ”విష్ట భ్యాహ మిదం కృ త్స్నం ఏకాం శేన స్థితో జగత్‌” అంటూ నేను ఈ జగత్తు నందు ఒకే అంశంతో వ్యాపించియున్నాను అన్నాడు.
పాలసంద్రమైనా, బంగరు మేడలైనా, ఆదిశేషుడై నా, జలతారు పట్టెమంచాలయినా, గరుత్మంతుడైనా, గజ, తురంగ ఆందోళికలైనా యోగేశ్వరుడయిన భగవం తునికి సమానమే. సుఖ దు:ఖాలకతీతుడు గదా ”సమ త్వం యోగ ముచ్యతే” అన్నింటినీ సమానంగా చూడట మే ”సమత యోగము” అని గీతాచార్యుని సందేశం. ప్రయోగంగా ఆయన అన్నీ చేసి చూపాడు యుగాలకూ, అన్ని లోకాలకు. ఆయన సర్వసముడు భాగవతంలో దేవకీ దేవి చేసిన స్తోత్రంలో ఇలా ఉంది.
”నష్టే లోకే ద్విపరార్థావ సానే- మహా
భూతేష్వాది భూతంగతేషు
వ్యక్తే, వ్యక్తం కాలవేగేన యాతే- భవానేక: శిష్యతే
శేష సంజ్ఞ:”
బ్రహ్మండమైన ప్రళయం ఏర్పడినప్పుడు శేష సంజ్ఞ గల నీ వొక్కడవే మిగులుతావు. నీవు నిత్య శక్తి మంతుడై న శ్రీకృష్ణుడవై శేషుడవుతున్నావు. భగవంతుని సత్తాయే తన పాన్పు. భగవత్‌ స్వరూపం శేషుడే.
భగవంతుని కైంకర్యం చేసే ఉద్దేశ్యంతోనే ఆదిశేషుడు శ్రీహరికి సెజ్జగా, ఆసనంగా, తలగడగా, ఛత్రంగా, విసన కర్రగా సేవ చేస్తాడు. ఈ అనంత సేవా సుఖమునకంటే, పట్టె మంచాల పవ్వళింపు సుఖప్రదమేమి కాదు. శేష తల్పమే శ్రీహరికి అనంత వైభవోపేతంగా ఉన్నది. శ్రీ మహా విష్ణువెప్పుడూ ఏకరూపుడే. భక్తునికి మాత్రం ఏక త్వంలో అనేకంగా కన్పిస్తాడు. ఈ పరమార్థమెరిగిన వారికి బహుత్వ బోధ ఉండదు. సందేహం ఉండదు. సందేశమే ఉంటుంది. అనేకత్వంలోనే ఉన్నది ఏకత్వమే నంటూ కవి శేషప్ప నరసింహ శతకంలో చక్కగా పరమా త్మ ఏకత్వ భావనను వర్ణించారు. ఏకత్వ భావన సర్వ కాల సర్వావస్థలలో ప్రతి జీవిలో ఉండాలి. అప్పుడే సుఖ శాంతులు లభిస్తాయి.
– పి.వి.సీతారామమూర్తి, 94903 86015

Advertisement

తాజా వార్తలు

Advertisement