Tuesday, November 19, 2024

వ్యాస మహర్షి నిర్వేదం-నారదుని ఉపదేశం!

కలియుగంలో మంద బుద్ధులైన మానవులచే పఠించడానికి అనువుగా, వేదాలను విభజించి, స్త్రీలు, శూద్రులు, బ్రహ్మ బంధువులూ వేద శ్రవణానికి సమర్థులు కాని కారణంగా, సామాన్యులకు అందరికీ క్షేమం కలగాలని మహాభారతాన్ని రచించాను. పెక్కు పురాణాలు రూపొందించాను. అయినా ఎందుకో నా హృదయం సంతుష్టం కావడంలేదు. ఈ అసంతృప్తికి కారణం ఏమై ఉంటుంది? అనే ఆలోచనలో పడి వ్యాసమహర్షి సరస్వతీ నదీతీరంలో ఏకాంతంగా కూర్చొని తన అసంతృప్తికి కారణం ఆలోచిస్తున్నాడు.
ఇంకా ఆయన మనసులో ”కఠోరమైన వ్రతాలు ఎన్నో చేసాను. ఆచార్యులను, మహర్షు లను గౌరవించాను. వేదాలలోని అర్థాన్నంతా మహాభారతంలో వివరించాను. ఎంత చేసినా ఏమిటో నా మనసుకు సంతృప్తి కలగడంలేదు. హరి భక్తులకు అత్యంత ప్రీతికరమైన భాగవ త స్వరూపాన్ని రాయలేదు. ఎంత తెలివితక్కువ పనిచేసాను.” అని వ్యాసమహర్షి ఆలోచి స్తుండగా, నారాయణ మంత్రం ఉచ్చరిస్తూ, తన మహతి వీణ మీటుతూ, వ్యాసమర్షి ఉన్న చోటుకు విచ్చేసాడు నారద మహర్షి.
వ్యాసులవారు నారద మహర్షిని ఘనంగా సత్కరించారు. అపుడు నారదమహర్షి ”పరాశరనందనా! నీవు ధాతవు. పంచమ వేదమైన మహాభారతాన్ని రచించావు. వేదాల సారాన్ని చక్కగా బోధపరచుకొన్నావు. కామ, క్రోధ, లోభమనే ఆరు అరిషడ్వర్గాలను జయించిన వాడవు. పరబ్రహ్మ తత్త్వాన్ని నిర్ణయించినవాడవు. నిన్ను చూస్తుంటే ఏదో విచా రంలో ఉన్నట్లుగా కనపడుతోంది. కారణం ఏమిటి?” అని అడగ్గా, వ్యాసమహర్షి బదులిస్తూ ”మహా మునీ! నీకు తెలియనిది ఏముంది? బ్రహ్మ మానస పుత్రుడవు. మహోత్తరమైన తత్త్వోపదేశంలో అగ్రగణ్యుడవు. నీవు సూర్య భగవానుడులా ముల్లోకాలు సంచరిస్తుంటా వు. వాయుదేవునిలా సర్వ మానవుల మనసుల్లో మెలగుతుంటావు. నీవు ఎరుగని ధర్మం అంటూ ఏదీ లేదు. నాకు కలిగిన అసంతృప్తికి కారణం ఏమిటో, దయతో వివరించి చెప్పు” అనగానే-
”పరాశర్యా! హరినామ సంకీర్తన లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడి, దుర్గం ధ భూయిష్టమైన కాకులు మూగిన, ఎంగిలాకుల బురదగుంటలా శోభాకరం కాదు. కర్మ వాసనారహతం, ఉపాధి విరహతము అయిన జ్ఞానం విష్ణు భక్తి లేకపోతే విశేషంగా ప్రకాశిం చదు. జ్ఞానం కాని, వాక్కు కానీ, కర్మ కానీ ఎంత గొప్పవైనా భక్తి లేనినాడు నిరర్థకాలే. వ్యాసమహర్షి! నీవు సత్యదర్శనుడవు. సత్య నిష్ఠుడవు. మానవులందరికీ భవబంధ ముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తి పురస్సరంగా అభివర్ణించు. మూఢమానవులు కామ్య కర్మలయందు ఆసక్తులై, అదే ప్రధానమని భావించి కలుషితాలైన వాటిపైనే ఆధారపడి పరమార్థాన్ని విస్మరిస్తారు. అందువల్ల వారి బుద్ధి పెడదారి పట్టకుండా, భగవతత్త్వాన్ని అం దించి వారి వ్యథలు తొలగించు. అందుకే నీవు సమాయత్తమై శ్రీహరి లీలా విశేషాలు గురిం చి రచించడానికి పూనుకో! మునీంద్రా!
ప్రాజ్ఞుడైనవాడు కామ్యకర్మలన్నింటిని పరిత్యజించి, గోవిందుని గుణగణాలు యందు అనురక్తుడై, #హరి స్వరూపం తెలుసుకోవడానికి సంసిద్ధులవుతారు. అందువల్ల తెలిసిన వా రు శ్రీహరి సేవాపరాయణుడై, సన్మార్గంలో నడవడానికి వీలవుతుంది. కాలానుగుణంగా కష్టసుఖాలు ఎదురైనా, అంతా ఆయన కృపే అని తలపోస్తూ ,ఆయన చరణాలు వదలరు. శ్రీహరి సేవాపరాయణుడైనవాడు నీచ జన్మ పొందినప్పటికీ, సంసార బంధాల్లో చిక్కుకో డు. మ#హర్షీ! ఈ విశ్వమంతా విష్ణు మయం. ఈ విశాల ప్రపంచంలో శ్రీహరి కంటే అన్యమై నది ఏదీలేదు. ఆ పరమేశ్వరుని సంకల్పం చేత ఈ ప్రపంచానికి సృష్టి, స్థితి, లయకారాలు ఏర్పడుతుంటాయి. నీవు సర్వజ్ఞుడవు. నీవే ఒకచోట విష్ణు అంశతోనే జన్మించానని చెప్పావు. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విశేషాలను అందించు. మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికి, ఔదార్యానికి, అనుష్టానానికి, తపస్సుకి, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్యపురుషుడైన పురుషోత్తముడుని స్తుతించడమే. ఓ! వ్యాస మునీంద్రా! తీర్థపాదుడైన దేవాది దేవుడు, వాసుదేవుడు, ఆయన లీలలను నేను గానం చేసే సందర్భంలో ఆయన నన్ను పేరు పెట్టి పిలిచినట్లుగా, నా మనసులో అనిపిస్తుంది. ఈ సంసార సముద్రంలో మునిగితేలు తూ విషయ వాంఛలపై మనో వైకల్యాలు కొని తెచ్చుకొనేవారికి, గోవిందుని గుణకీర్తనం, దివ్య లీలలు ఒక ఒడ్డుకు చేర్చే తెప్పవంటివి. మునీంద్రా! యమమూ, నియమమూ, ప్రాణా యామమూ, మొదలైన అష్టాంగముల ద్వారా మనసును ఎంత కట్టుదిట్టం చేసినా, కామ ము, క్రోధము, మొదలైన వానిచే మనిషి మోహావేశంలో చిక్కుకుపోతాడు. శాంతి లభించ దు. శాంతి లభించాలంటే, వాసుదేవుని సేవ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నీవు శ్రీహరి లీలలను లోకానికి అందించే పనిలో నిమగ్నమై ఉండు!” అని ఉపశమన వాక్యాలు చెప్పి, తన మహతి వీణ తగిలించుకొని, నారాయణ మంత్రం స్తుతిస్తూ వెళ్ళిపోయాడు.
నారద మ#హర్షి వెళ్ళిన తదుపరి వ్యాసమహర్షి సరస్వతీ నది ఒడ్డున యజ్ఞయాగాదులు చేసుకోవడానికి అనుకూలంగా, బదరీ వృక్ష సమూహంతో ఉన్న ”శయ్యాప్రాస” అనే ఆశ్ర మం వెళ్ళి, తన చిత్తంతో, ఆత్మసంయోగంతో భగవంతుని దర్శించి హరి భక్తి అనే యోగమే లోకానికి మేలు అని భావించి, భాగవతమనే గ్రంథ రచనకు ఉపక్రమించారు.
భాగవతం చదివితే బాగవుతాము అని అంటారు. కాబట్టి శ్రీహరి లీలా విశేషాలతో ఒప్పారుతున్న భాగవతాన్ని చదువుదాము. ముక్తిని పొందుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement