Thursday, November 21, 2024

చైతన్య దర్శనం!

అవతార పురుషుడైన శ్రీరామచంద్రునకు కలిగిన మనో వైకల్పిక సందేహములకు వసిష్ఠ మహాముని ప్రవచించిన జ్ఞాననిధియే యోగవాసిష్ఠము. ఈ జగత్తు అనిర్వచనీయ భావమును అల్పుడైన మానవునకు విశదపరచిన మహిమాన్వితుడు వసిష్ఠుడు, చిత్తపు భావ భ్రాంతియే జగత్తు. అగ్ని నుండి తాపము, పుష్పము నుండి సుగంధము, కాటుక నుండి నలుపు, మంచు నుండి తెలుపు, చెఱుకు నుండి తీపి, తేజము నుం డి వెలుగు, జలము నుండి తరంగము వేరుగానట్లు చిత్తము నుండి జగత్తు వేరు కాదు. చిత్తము నుండి అనుభవము వేరు కాదు. ఆ అనుభవమే అహం. జీవుడు మ నస్సు కంటే అన్యము కాదు. మనస్సు నుండి ఇంద్రియములు, ఇంద్రియముల నుండి శరీరము, శరీరము నుండి జగత్తు అన్యము కాదు. అనగా ఇంద్రియాత్మక మనస్సు చైతన్యముతో కూడి ఈ జగత్తు ను దర్శించుచున్నది. ఆ చైతన్య దర్శనమే ఈ జగత్తు.
జ్ఞానదృష్టికి ఇదంతయూ కల్పితము. అందువలననే శంకరులు ఈ జగత్తు మిథ్య అని బోధించినారు. ఇది అంతయూ చలించుచున్నట్లున్ననూ అది భ్రమ తప్ప వేరుగాదు. అదియే బ్రహ్మ సత్యము స్థిరము, శాశ్వతము. అఖండమైన ఆత్మజ్ఞానమునకు మాత్రమే ఆకాశ స్వరూపమైన పరబ్రహ్మ ము తనయందు అనగా చైతన్యమను ఆత్మ యందు దర్శనమగును. తదు పరి శూన్యము శూన్యమునకు, బ్రహ్మ బ్రహ్మమునకు, సత్యము సత్యము నకు, పూర్ణము పూర్ణమునకు కనబడును.
ఇక లోక వ్యవహారములు జీవునకు తప్పవు. జ్ఞాని అన్నింటినీ ఆచరిం చును. అయితే దేహాత్మభావనతో కాకుండా కర్తృత్వ, భోక్తృత్వలనే ఆసక్తుల ను విడిచిపెట్టి కర్మలు చేయును. కావున యధార్థమునకు జీవుడు ఏమి యూ చేయుట లేదు. చేయుచున్నాననే భ్రాంతి తప్ప. దేహాత్మ భావనలో పడిన అజ్ఞానులు తామే చేయుచున్నామనే బుద్ధి వలన సుఖ దు:ఖములు కలుగుచున్నవి. కావున ఎవనికి కర్తృత్వాభిమానములు లేక, బుద్ధి నిర్లిప్తమై యుండునో వానికి చావు పుట్టుకలు లేవు. చిత్తమున దర్శించుచు న్నావు కనుకనే ఇదంతయూ కనపడుతుంది. ఉన్న దను సద్భావము కల్పించుకొనుటయే మాయ. జ్ఞా న పరిపక్వత వలన ఈ మాయ అను అహంకార ము నశించును.
ఎవనికి ఈ జ గత్తు నందు కనపడుచున్న వన్నియూ సుఖదు: ఖముల కొరకు, వైభవ దారిద్య్రముల కొర కు, ఆరోప అపవాదములకు, వియోగ సం యోగములకు కాకయుండునో అనగా ఆ విధముగ భావింపకుండనో అతడే జీవన్ము క్తుడు. దీనికిగాను అంత:ర్ముఖులై అనంత ఆకాశమున గల నిర్మలత్వమును తమలో దర్శించవలెను. మనోబుద్ధి అహంకారము లు, ఇంద్రియ సమూహము ఆ నిర్మల చిన్మ య సత్తను అతిక్రమించి ఉండలేవు.
భోగతృష్ణా విషావేశో యదైవోపశమం గత:
తదైవమస్తమ జ్ఞాన మాన్ధ్యం ధ్వాన్తక్షయాదివ
అంధకారము తొలగిన, తత్కల్పితమగు అంధత్వము తొలగునట్లు, విషము వలె మూర్ఛను గల్పించు భోగవాసనలు ఉపశమించిన, అజ్ఞాన ము కూడా వినష్టమైపోవును. ఈ విధముగా శ్రీరామచంద్రునకు స్థిరచిత్త మును కల్పించుటకు వసిష్ట మహాముని యోగవాసిష్టమును ప్రారంభించి నారు. మానవజన్మ స్థితి రహస్యమును తెలుసుకొను జ్ఞానమును ప్రసా దించమని ఆ రాముని కోరుటయే ఈ జన్మకు సార్థకమై నిలుచును.

Advertisement

తాజా వార్తలు

Advertisement