Tuesday, November 26, 2024

విశ్వేశ్వర జ్యోతిర్లింగము

శ్లో సానందమానందవనే వసంతం
ఆనంద కందం హతపాప బృందమ్
వారణాసీ నాథమనాథ నాథం
శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే ॥

భావము: ఆనందముతో కూడినవాడు ఆనంద వనమనే పేరుగల వారణాసి (కాశీ) పురములో నివసించే వాడూ, ఆనందమునకు నిలయమైనవాడూ, పాపసమూహాన్ని పొగొట్టేవాడూ, అనాధులైన జీవులకు (ప్రాణులకు) నాధుడైన వాడూ అయిన శ్రీవిశ్వనాధుని శరణుపొందుతున్నాను. (వరణ అని అను గంగానదీపాయలు కలసిన చోటున ఉన్న నగరం కావున దానికి వారణాసియని పేరువచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు విశాలాక్ష్మి ఈమె అష్టాదశ శక్తులలో ఒకర్తె. కావున ఇది ఒక శక్తి పీఠము.

పురాణగాధ: సృష్ట్యాదియందు పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు ఈ భువన ములను సృష్టింపదలచి ప్రకృతి-పురుషుడు (స్త్రీ-పురుషుడు) అను రూపములను ధరించాడు. ఆ ప్రకృతి పురుషులిద్దరు తమ తల్లిదండ్రులెవరో తెలుసుకోలేక విచారిస్తున్న సమయములో పరమేశ్వరుడు ప్రత్యక్షమై “మీరిద్దరూ తపస్సు చేయండి. బ్రహ్మాండాన్ని సృష్టించండి” అని చెప్పాడు. అప్పుడు వారు తాము తపస్సు చేయడానికి అనువైన ప్రదేశమేది? అని అడిగారు. అపుడు పరమేశ్వ రుడు అయిదు కోసులు పొడవు – వెడల్పులుగల నగరాన్ని నిర్మించేడు. ఆనగరమే కాశీ. అది ఆ పురుషునికి దగ్గరలో ఆకాశంలో నిలిచింది. ఆ పురుషుడే శ్రీ మహావిష్ణువు.

విష్ణువు సృష్టిని సంకల్పించి చాలా సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. అలసిన అతని శరీరంనుండి స్వేదము (చెమట) ధారాళముగా స్రవించి విశాలా కాశంలో ప్రవహించింది. ఆ విచిత్ర దృశ్యాన్నిచూచి ఆశ్చర్యంతో విష్ణువు తలూపాడు. అప్పుడాతని చెవినుండి మణులతో కూడిన కర్ణాభరణం జారి పడింది. అది పడిన ప్రదేశమే ‘మణికర్ణిక’ తీర్థమయ్యింది. శ్వేద జలధార అంతకంతకు అధికమై చివరకు కాశీనగరం మునిగి పోవడం మొదలయ్యింది. అపుడీశ్వరుడు కాశీనగరాన్ని తన త్రిశూలంతో యెత్తివుంచాడు. మహావిష్ణువు తన భార్యయైన ప్రకృతితో అక్కడ నిద్రించాడు. అతని నాభి నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. అతడు శివాజ్ఞతో ఈ బ్రహ్మండాన్నీ పదునాలుగు భువనాలనూ, సకల చరాచర సృష్టినీ చేశాడు.

సందర్భంగా, బ్రహ్మ, విష్ణువు మొదలగు వారంతా పరమేశ్వరుని యెన్నో విధాలు స్తుతించారు. సంతుష్టుడైన పరమేశ్వరుడు వారందరి కోరికపై అక్కడ (కాశీలో) విశ్వేశ్వర జ్యోతిర్లింగమై వెలిశాడు. ప్రళయకాలంలో పరమేశ్వరుడు కాశీనగరాన్ని తన త్రిశూలంపై నిలబెడతాడనీ, “కాశ్యాంతు మరణాన్ముక్తిః’ అను సూక్తి, వలన ఇక్కడ మరణించిన వారు పునర్జన్మ లేకుండ మోక్షమును పొందుతారని పురాణ వచనములు. (స్కాంద పురాణము – కాశీ ఖండంలో చెప్పబడినది.) అంతే కాకుండా –

- Advertisement -

“కదా కాశీం గమిష్యామి కదాద్రాక్ష్యామి శంకరమ్ |
ఇతి బ్రువాణస్సతతం కాశీవాస ఫలం లభేత్ ॥” అంటోంది.
అంటే, “ఎపుడు కాశీకి వెళతానో, ఎప్పుడు విశ్వేశ్వరుని దర్శిస్తాలో, అని మనస్సులో పదేపదే తపన పడేవారికి కాశీలో నివసించినంత పుణ్యఫలం లభిస్తుంది.” అని భావము. చరిత్ర: వేదవాఙ్మయకాలం నుండీ, ప్రపంచ నాగరికతకంటే ముందుగానే నాగరికత పొందిన నగరముగా వేద వాఙ్మయానికీ, హైందవ సంస్కృతికి, విజ్ఞాన భండారాలకూ నిలయమైన నగరముగా ప్రసిద్ధినందినది.

మౌర్యులు, కనిష్కుడు, సముద్ర గుప్తుడు, హర్షవర్ధనుడు, యశోవర్మ, మిహిర భోజుడు, మహీపాలుడు మొదలగు చక్రవర్తులు విశ్వనాధుని సేవించి క్షేత్రాభివృద్ధికి కృషిచేశారు. సోమనాధ దేవాలయములాగే కాశీ విశ్వనాధుడు కూడా హిందువులకు ఈ ఆలయానికున్న భోగభాగ్యాలు, మడిమాన్యాలూ మహారాజులు కంటే గొప్పగా వుండేవి. అందుచేతనే ఈ దేవాలయం యెన్నోసార్లు (11 శతాబ్ది పూర్వార్ధం నుండి 17వ శతాబ్ది ఉత్తరార్ధం వరకు గల 600 సం॥లు) ముట్టడించబడి, దోచుకోబడి, ధ్వంసము చేయబడింది. 1670లో మత ఛాందస్తుడైన ఔరంగజేబు విశ్వనాథ దేవాలయ విధ్వంసానికి పూనుకొని ఆలయంలోనికి ప్రవేశించగానే అక్కడ విశ్వేశ్వరుదదృశ్యుడయ్యాడట. దాంతో ఔరంగజేబు విశ్వనాధ మందిరాన్ని పడగొట్టి మసీదుగా మార్చాడు. తర్వాత ఇండోర్ మహారాణి ‘అహల్యాబాయి’కి కలలో విశ్వ నాథుడు కనబడి తానున్న ప్రదేశాన్ని చెప్పాడట. అప్పుడామె 1776లో తిరిగి ప్రతిష్టించి నూతన మందిరాన్ని నిర్మింపజేసింది. 19వ శతాబ్దంలో రాజారంజిత్సింగ్ ఆలయ శిఖరానికి బంగారు పూత పూయించాడు. అలా తర్వాత చాలామంది ఆలయాభివృద్ధికి కృషిచేశారు.

ఈ కాశీ క్షేత్రంలోనే హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు పెట్టిన బాధలకు తట్టుకొని సత్యవాక్య పరిపాలకుడన్న పేరు పొందేడు. గౌతమ బుద్ధుడు ఇక్కడనే మొదట ధర్మ సందేశాన్నిచ్చాడు. జైనమత స్థాపకులైన పార్శ్వనాధుడు కాశీరాజు కుమారుడే. జగద్గు రువు శంకరాచార్యులు అద్వైత మతాన్ని స్థాపించారు. ఇలాయెంతో చరిత్రగల ఈ కాశీ నగరం వారణాసి, బెనారస్ అనే పేర్లతో కూడ పిలువబడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement