శ్రీమదాంధ్ర మహాభారతంలో విదురనీతి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంది. తిక్కన సోమయాజి కలం నుండి జాలువారిన పదిహేను పర్వాలలో విరాట, ఉద్యోగ, శాంతి పర్వాలు ఉత్కృష్టమైనవి. వీటిలో ఉద్యోగ పర్వంలో సంజయ రాయబారం, విదురనీతి, పాండవుల అభిప్రాయ సేకరణ, పాంచాలీ పరి దేవనం, శ్రీకృష్ణరాయభారం మొదలగు యుద్ధానికి-శాంతికి సంబంధించిన కథాంశాలు నాటకీయ శైలిలో కవిబ్రహ్మ చేతిలో బలంగా రూపుదిద్దబడ్డాయి. ఇందులో విదురనీతి ఘట్టం సనాతన భారతీయ ఐతిహాసిక సంస్కృతిలో భాగంగా నేటికీ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది.
యావత్తు కురు సామ్రాజ్యానికి రాజు ధృతరాష్ట్రుడు. సంజయుడు ఇతని సలహాదారి, రధసారథి. యుద్ధ నివారణ నిమిత్తం కౌరవుల పక్షాన ఉపప్లావ్యానికి వెళ్లి శ్రీకృష్ణుడు, ధర్మరాజాది కౌంతేయులతో మాట్లాడుతాడు. ఆ సమాయన ధృతరాష్ట్రుని పక్షపాత బుద్ధిని అందరూ ఎండగడతారు. శాంతి ప్రయత్నంలో భాగంగా సంజయుడు ధర్మరాజు యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటాడు. తిరుగు ప్రయాణంలో హస్తినపురానికి వచ్చి పాండవుల సందేశాలను తెలుపుతూ ధృతరాష్ట్రుని నిందిస్తాడు. ఆ మాటలకు అంధరాజు మనసు పరిపరి విధాలుగా వికలమౌతుంది. దానివల్ల అతను నిద్రకు దూరమౌతాడు. ఆ పరిస్థితిలో రాజాజ్ఞ మేరకు మహాజ్ఞాని, నీతికోవిదుడైన విదురుడు రాజుగారి మనోవేదన ఉపశమనా నికి కొన్ని నీతి సూత్రాలను సుబోధకంగా ఎరుక పరుస్తాడు.
ప్రత్యేకించి ఉద్యోగ పర్వంలో తిక్కన వ్రాసిన పద్యాలు తెలుగునాట మహా భారత గ్రంథ పాఠకులను ఎల్లప్పుడూ రంజింపజేస్తూ కర్తవ్య బోధను చేస్తాయి. ఆ పద్యాలన్నింటిలో ఒక పద్యం ”ధనమును విద్యయు వంశంబును… నివియు తెచ్చు నుర్వీనాథా!” భావాన్ని ఇక్కడ సంపూర్ణంగా ఉదహరించుకుందాం. ధనం, విద్య, గొప్ప వంశాన్ని చెడ్డవారు మిగుల పొందియున్నట్లయితే, వారు అహంకా రంతో విర్రవీగుతూ, ఉచ్చనీచాలు మరచి ప్రవర్తిస్తారు. అవే మూడు అంశాలు మంచివారికి దక్కినట్లయితే మిక్కిలి వినయ విధేయతలు కలిగి ఒంగి ఒంగి ఉంటారు. వీరు లోకంలో చిన్నాపెద్దా అనే తారతమ్య భావంతో మెలుగుతారు. అయితే ఈ పద్య భావానికి అనుగుణంగా రెండు ఐతిహాసిక గాథలను దృష్టాం తాలుగా పేర్కొనవచ్చు. లక్ష్మీనాథుడై మిక్కిలి సంపద, అసమాన విద్యా సంపన్నత కలిగిన యదుకుల భూషణుడైన శ్రీకృష్ణుని వద్దకు తన బాల్యమిత్రుడైన కుచేలుడు ఓసారి కార్యార్థియై వెళ్తాడు. ఆ సమయంలో అష్ట భార్యలతో అంత: పురంలో దేవ దేవుడు ఉంటాడు. అంతట మిత్రుని రాక తెలుసుకొని ఆత్రంగా కన్నయ్యే సతీసమే తంగా ఎదురేగి వెళ్ళి ఆ బీద బ్రాహ్మణున్ని తన మందిరానికి ఆహ్వానిస్తాడు. అక్కడ ఉచితాసనం మీద కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాలొనర్చి సత్కరించిన తీరు పద్యభావంలో గల మొదటి విషయాన్ని ప్రస్ఫుటింపజేస్తున్నది. సకల సంపద లకు నిలయుడు, అస్త్రశస్త్రాది విద్యలలో ఆరితేరినవాడు, రాజవంశ దుర#హంకా రంతో సింహాసనాధీశుడై ఉన్న ద్రుపద మహారాజు వద్దకు ఒక పాడియావు ఇమ్మని కుంభసంభవుడైన ద్రోణాచార్యుడు వెళ్తాడు. తద్వారా తన పేదరికాన్ని, బిడ్డకు పాలిచ్చే ఆవుని సమకూర్చలేని తన నిస్సహాయ స్థితిని తెలియబ రుస్తాడు. సాయం చేయ మని వేడుకుంటాడు. ఇలా ప్రాధేయపడుతున్న తన చిన్ననాటి స్నేహితున్ని ద్రుపదుడు గుర్తు పట్టనట్లు నటిస్తాడు. దాంతో ద్రోణుడు రాజా! చిన్నతనంలో మనమి ద్దరమూ స్నేహితులం, ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించామని జ్ఞాప కం చేస్తాడు. దానికి ద్రుపదుడు కోపంతో రగిలిపోయి ద్రోణుణ్ణి అవహేళన చేస్తూ పలికిన మాటల సందర్భం పద్యభావంలో ఉన్న రెండో అంశానికి గాను అద్దంలా ప్రతిబిం బిస్తున్నది. ఈ రెండు కథాంశాలను బట్టి ఒకే సందర్భంలో సజ్జనుడి, దుర్జనుడి ప్రవర్తనలు ఎలా ఉంటాయో! మనకి సుస్పష్టమౌతుంది. దీనిని బట్టి పై పద్య భావంలోని నీతిని నేటితరం గ్ర#హంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.