Saturday, November 23, 2024

హారతులు – శుభ ఫలితాలు!

హారతులను ఇచ్చేందుకు రకరకాల హారతి పళ్ళాలను తయారుచేస్తుంటారు. ఓంకారం, కుంభం, నాగ, చంద్ర, సూర్య, నక్షత్ర హారతి…. ఇలా దేవునికి ఏ ఆకృతి పళ్ళాలలో హారతి ఇస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.
ఓంకార హారతి
సృష్టికి మూలం ఓంకారం. అమ్మవారిని సృష్టి స్వరూపిణిగా పిలుస్తుంటాం. ఓంకార నాదాన్ని వినడం వల్ల, ఓంకార రూపాన్ని చూడటం వల్ల పాపాలు తొలగిపోవడంతోపాటు శుభపరంపర లు కలుగుతాయని నమ్మకం. అందుకే తొలుత ఓంకార హారతితో శ్రీకారం చుట్టనున్నారు.
ఏక హారతి
ప్రతిదీ ఒకేవిధంగా ఉండటానికి ప్రత్యేకించి అంతరంగాలు ఒక నిశ్చల స్థితిలో ఉండేందుకు దోహదం చేసేదే ఏకహారత. ఇది నదుల్లోని ఔషధ గుణాలు పెరగడానికి కూడా తోడ్పడుతుంది.
నాగ హారతి
దేవతా స్వరూపమైన నాగ సర్పం దీర్ఘాయువుకు, పవిత్రత కు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌ భాగ్యం, రోగనివారణ కలుగుతుంది. సర్పదోషాలు తొలగుతా యి. జ్ఞానత్వం కూడా లభిస్తుంది. నాగదోషం ఉన్నటువంటి వ్యక్తులు జ్యోతి స్వరూపమైన హారతిని చూడటంవల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాల్లో చెబుతున్నారు.
పంచ హారతి
సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే నామాలతో ఉన్న ఈశ్వరునికి ప్రతి రూపం పంచహారతి. ఈ హారతి దర్శనంవల్ల భక్తులకు పంచ మహాపాతకాలు నశిస్తా యి. పంచ ప్రాణాలకు సాంత్వన కలుగుతుంది. మల్లేశ్వర స్వామివారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్మకం. అదీకాకుండా అమ్మవారు కూడా పంచముఖాలతో ఉంటుంది. అందువల్ల పంచహారతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
కుంభ హారతి
సమాజానికి రక్షను కలిగించేది కుంభ హారతి. మ#హమాన్వితమైన కుంభ హారతిని దర్శించడం వల్ల భక్తులకు అనన్యమైన పుణ్యం, పంచ భూతాత్మకమైన జీవ రక్ష లభిస్తుంది. నరఘోషతోపాటు సమస్త దిష్టి దోషాలు తొలగిపోతుంది. మనస్సు ప్రశాంతత సాధించాలనుకున్నా ఈ హారతిని ఒక్కసారి చూస్తే సరిపోతుందని పురాణాలు చెబుతు న్నాయి.
సింహ హారతి
దుర్గామాత అమ్మవారి వాహనం సింహం. శత్రువులను శిక్షించి, ధర్మాన్ని రక్షించే తత్వానికి, ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహ హారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గ అనుగ్రహం లభిస్తుంది. మనలో ఉన్నటువంటి అసుర ప్రవృత్తి తొలగి సద్భావం పెంపొందుతుంది.
నంది హారతి
ఈశ్వరుని వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. ప్రథమ గణాల్లో ఒకరుగా నంది ప్రతీతి. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వాహనం. పుణ్యానికి, ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నంది. ఈ హారతి భక్తులకు నిర్మలమైన భక్తి సకల ధర్మాచరణ అనే ఫల ప్రాప్తి అందిస్తుంది. పరమేశ్వరుని అనుగ్ర#హంతో జ్ఞానత్వం లభిస్తుంది.
సూర్య హారతి
లోకబాంధవుడు, కర్మసాక్షి అజస్ర, సహస్ర విజప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్య హారతి వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యం లభిస్తుంది. దీనివల్ల ఆయుష్షు పెరుగుతుంది. దీన్ని దర్శించు కోవడం వల్ల మన శరీరానికి ఆరోగ్యం సిద్ధిస్తుంది.
చంద్ర హారతి
పుడమిని, పాడి పంటలను, మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమకన్ను. చంద్ర హారతి దర్శనం వల్ల భక్తుల్లో పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణం వృద్ధి చెందుతాయి. మనస్సుకు స్వచ్ఛత చేకూరడంతో పాటు ప్రశాంతత కలుగుతుంది.
నక్షత్ర హారతి
27 నక్షత్రాల్లోనే కోట్లాదిమంది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు అక్షయమైన పుణ్యం సిద్ధిస్తుంది. నక్షత్ర దోషాల వల్ల వచ్చే సమస్యలు తొలగిపోవాలని ఇచ్చేదే నక్షత్ర హారతి.
కృష్ణమ్మ హారతి వీక్షణతో పూర్ణ ఫలం లభిస్తుంది. దీనివల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ హారతిని ఆఖరుగా ఇస్తారు.

|– డా. చదలవాడ హరిబాబు 9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement