”నమస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తే, మహాలక్ష్మీ నమోస్తుతే”
శంశం చక్ర గద ధారణియైన మహాలక్ష్మీదేవి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాం తి, సంతోషం, శక్తిలాంటి అష్టైశ్వర్య ప్రదా యిని. అష్టసంపదలు ఒసంగే జగన్మంగళ దాయిని. అష్టైశ్వర్యాలు కలుగజేసే రూపం వరలక్ష్మిగా ఆరా ధనీయం. కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే జగజ్జనని వరలక్ష్మి. అన్ని లక్ష్మీ పూజలకన్నా, వరలక్ష్మీ పూజ ఉన్నత మైనదని శాస్త్ర వచనం. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య. వైకుంఠ నాథుని జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల శ్రావణ మాసంలో వరలక్ష్మిని ఆరాధిస్తే, విశేష ఫలమని భావన. ఆయురారోగ్య ఐశ్వర్య సంతోషాదులు లక్ష్మీదేవిని అత్యంత ప్రియమైన శుక్రవారం పూజిస్తేనే కలుగుతాయని శ్రీసూక్తం వివరిస్తున్నది. వరలక్ష్మిని షోడశోపచార పూజలతో సేవిస్తే, అష్ట ఐశ్వర్యాలు, అయిదవతనం, సత్సంతానం, సంతానాభివృద్ధి కలకాలం ఉండ గలవని శాస్త్ర వచనాలు. సకల కోరికలు ఈడేరాలని, సర్వమంగళ సంప్రాప్తి కలగాలని, నిత్య సుమంగళి గా వర్ధిల్లాలని ఈ వ్రతాన్ని వివాహితులు ఆచరి స్తారు. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలు స్తారు. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యం గా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. శ్రావణ శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం సువాసినులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం హిందూ సంప్రదాయం. మంచి భర్త, సత్సంతానం కల గాలని అమ్మాయిలు పూజిస్తారు. ఈ రోజున దేవత ను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మ కంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుం టా రు. దేవతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు… సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. కైలాస నాథుడు, పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రతాచరణ గురిం చి వివరించినట్లు స్కంద పురాణంలో ఉంది. లోకం లో స్త్రీలు సకలైశ్వర్యాలు, పుత్రపౌత్రాదులను కలి గేందుకు ఏదైనా వ్రతం గురించి తెలపాలని పార్వతీ దేవి, పరమ శివుని కోరగా, వరలక్ష్మీ వ్రతాన్ని అభ యంకరుడైన శంకరుడు వివరించారు. ఈ సంద ర్భంలోనే భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రదర్శించిన మగధ రాజ్య అంతర్గత కుండిన నగర వాసియైన పరమ సాధ్వి చారుమతి ఉత్తమ ఇల్లాలిగా ప్రవర్తించిన నేపథ్యాన్ని వివరిం చారు. మహాలక్ష్మిని చారుమతి చిత్తశుద్ధితో పూజిం చిన క్రమంలో వరలక్ష్మి ఆమెకు స్వప్న సాక్షాత్కా రమై, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే, కోరిన వరాల్ని ఒసంగెదనని వర మిచ్చినట్లు కథనం. ముందుగా గణపతిని పూజిం చి కలశంలోనికి అమ్మవారిని ఆవాహన చేసి షోడ శోపచార పూజ, అథాంగ పూజ చేయాలి.
”సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే”!!
అంటూ పూజ చేయాలి. అష్టోత్తర శత నామాల యుక్త దూప, దీప, నివేదన, తాంబూలాలను సమ ర్పించి, కర్పూర నీరాజనం, మంత్రపుష్పం, మంగ ళ హారతి సమర్పణ గావించి, తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది ముడులను వేసి, మధ్యన పంచ పుష్పాలు కట్టి తోర గ్రంథి చేసి తోర గ్రంధి పూజ, తోర గ్రంధి మంత్ర పఠనం చేయాలి.
”లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం, శ్రీరంగ ధామేశ్వరీం, దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకు రాం, శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ, బ్రహంద్ర గంగాధరాం, త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసి జాం, వందే ముకుంద ప్రియాం” అని స్తుతించాలి. నవ సూత్రధారణను కుడి చేతికి చేయాలి. ఫలభక్ష్య పానీయ పాయసాదులను అమ్మవారికి సమర్పిం చి, చివరగా వాయన దాన మంత్రంతో ముత్తయి దువను మహాలక్ష్మిగా భావించి, తాంబూలం అందించాలి. భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. వరలక్ష్మీ వ్రతం చేసినను, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలుగుతా యని సూత మహాముని శౌనకాది మహర్షులకు వివరించినట్లు పురాణ కథనం. ఈ వ్రతాన్ని ఆచరిం చడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతా చరణ వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలు గుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.
- రామకిష్టయ్య సంగనభట్ల
9440595494