Tuesday, November 26, 2024

విలువలు

తమవాదం వేదం అనుకుంటూ తమ మార్గం అత్యుత్తమం అనుకుంటూ ఆత్మవంచన చేసుకొనేవారెందరో? విలువలు ఈ పదానికి వర్తమాన సమాజం వివరించే అర్ధమేమిటో చెప్పలేం కానీ విలువలకు విలువ ఇవ్వలేని సమాజం నిలవటం అనేది కష్టం అని చెప్పగలం. విలువలను కాలరాస్తే అవి చరిత్ర గతిని తిరగరాస్తాయి. నిజమైన విలువలకు ఎప్పుడూ ఉన్నత స్థానమే లభిస్తుంది.
మనిషి జీవితానికి సరైన మార్గం చూపించే భక్తి, జ్ఞానం, సత్యం, ప్రేమ, నీతి మొదలైనవన్నీ విలువలే. జగద్గురువు శ్రీకృష్ణుని ఉపదేశ సారం యుగధర్మానికి దారిచూపేది. శంకర భగవత్పాదుల ‘మోహ ముద్గర’లో నిండిన భజగోవింద తత్త్వం విలువలమయమే. దు:ఖం మనిషి జీవితంలో అన్ని దశలలో, అన్ని పరిస్థితులలో ఉంటుంది. స్వార్థం దు:ఖానికి హేతువు. స్వార్ధం విడనాడితే దు:ఖనివారణ జరుగుతుంది. మరి దు:ఖం నుంచి విముక్తి పొందటానికి ఆచరించదగిన బుద్ధ³ుని బోధలు అష్టాంగమార్గాలు విలువలతో కూడినవే. భర్తృ#హరి సుభాషితాలు, సుమతీ, భాస్కర, వేమనాదుల శతకాలు విలువలు సూచించేవే.
ధర్మ విశిష్ట లక్షణాలుగా చెప్పబడిన సానుభూతి, ప్రేమ, సత్యాసక్తి, పరిశుద్ధత, ఉదాత్త భావన కరుణ విలువలేనని చెప్పాలి. ధ్యానమార్గం ద్వారా జ్ఞానోదయం కలుగుతుందంటారు. మనిషికి తన జీవితంలో ఎదురయే అనేక సమస్యలకు ఇవన్నీ పరిష్కారాలు సూచిస్తాయనటంలో సందేహం లేదు.
సత్యహరిశ్చంద్రుని గాథ, గాంధీజీ సత్యశోధన (ఆత్మకథ) సత్యం ఎంత శక్తిమయమో తెలియజేస్తాయి. ప్రేమతత్త్వం సాయిమార్గమని, పరిశుద్ధత, కరుణ క్రీస్తు పదానికి ప్రతీకలని, మొహమ్మద్‌ ప్రవక్త అల్లా ప్రవచనాలు మానవప్రగతికి దో#హదం చేస్తాయని అర్ధమౌతుంది. విదురనీతి, నీతి చంద్రికలు ప్రబోధించినవన్నీ విలువలే.
‘అకుంఠిత భక్తి’ భక్త శిఖామణులను భగవస్సాన్నిధ్యానికి చేర్చగలిగాయని తెలుసుకున్నాం. కైవల్యమే పరమపదమని ధృవుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, కన్నప్ప, తుకారాం, తులసీదాస్‌, రామదాసు, అన్నమయ్య, త్యాగయ్య వంటివారి కథలు ఎన్ని తెలుసుకోలేదు. భక్తిపారవశ్యం మనిషిని నిలువెల్లా పులకింప జేస్తుంది. ఆపద్భాంధవుడు, సర్వ జగద్రక్షకుడు తన భక్తులను ఎల్లవేళలా కాచేవాడే అనటానికి గజేంద్ర మోక్షం ఒక్కటి చాలు. ఇవన్నీ మనిషికి విలువల అవసరం ఎంతో చెబుతాయి.ఇవన్నీ వెలకట్టలేని నిధులు.
ఆలోచన సక్రమమైనదయితే అనుసరణ కూడా సక్రమంగానే ఉంటుంది. ఆచరించే మార్గాలు వేరయినా అన్నీ సరైన విలువలు అవలంబించాలని చెప్పేవే. కొన్నిసార్లు విలువలు పతనమైనా అది తాత్కాలికమే. తదనంతరం విలువల ప్రకాశానికి మిగిలినవన్నీ వెలవెలబోతాయి. అందుకే జీవితం పరిపూర్ణం అని చెప్పగలిగేది విలువలతో జీవితం సాగించిననాడే.

  • డాక్టర్‌ చక్రపాణి యిమ్మిడిశెట్టి
Advertisement

తాజా వార్తలు

Advertisement