Tuesday, November 19, 2024

వైకుంఠ ఏకాదశి (ఆడియోతో…)

వైకుంఠ ఏకాదశి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామనుజాచార్యుల వారి వివరణ…

మార్గశీర్ష శుద్ధ ఏకాదశి లేదా పుష్యశుద్ధ ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి’ లేదా ‘ముక్కోటి ఏకాదశి’గా వ్యవహరిస్తారు. ధనుర్మాసంలో వచ్చు శుద్ధ ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి’గా పరిగణిస్తారు. అలాగే మార్గశీర్ష శుద్ధ పక్షమున వచ్చు ఏకాదశి ‘గీతాజయంతి’గా ప్రసిద్ధి పొందినది. కార్తిక శుద్ధ ఏకాదశిని ‘పరివర్తన ఏకాదశి’ లేదా ‘ప్రబోదన ఏకాదశి’గా అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘శయన ఏకాదశి’గా వ్యవహరిస్తారు. స్వామి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు పరివర్తన చెంది అనగా ప్రక్కకు తిరిగి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని పుష్య శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి పూర్తిగా మేల్కొంటాడు. సంక్రమణ అనుగుణంగా పుష్య శుద్ధ ఏకాదశిని ‘ఉత్థాన ఏకాదశి’గా వ్యవహరిస్తారు. ఇదే ‘వైకుంఠ ఏకాదశి’ లేదా ‘ముక్కోటి ఏకాదశి’.

నిద్ర నుండి లేచిన ఆ శ్రీమన్నారాయణునిని దర్శించాలని ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వారమున నిరీక్షించుచుండగా, స్వామి మేల్కొనుటను తెలిసిన విష్వక్సేనాధులు వైకుంఠ ద్వారము తెరవగా స్వామి దివ్య సుందర విగ్రహమును ముక్కోటి దేవతలు దర్శించెదరు. ఈ ద్వారమునే ఉత్తర ద్వారమని శాస్త్రం చెపుతున్నది. దక్షిణము అనగా మృత్యు నిలయం, అజ్ఞాన ఆవరణము, సంసార ద్వారము, మోహ కూపముగా స్కాంద పురాణం చెపుతున్నది. ఉత్తరము జ్ఞానము, అమృతము, మోక్షముగా పిలువబడుచున్నది. అందువలన వైకుంఠమున చేరిన దేవతలు నిలిచిన ద్వారము ఉత్తర ద్వారము. అనగా మోక్ష ద్వారము, జ్ఞాన ద్వారము, వివేక ద్వారమని శాస్త్ర వచనం. ఉత్థాన ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని దివ్య మంగళ విగ్రహ దర్శనం వలన అన్ని దు:ఖములు తొలగి ఆనందము కలుగును కావున ఇది ఆనంద ఏకాద శనిబ్రహ్మాండ పురాణం ద్వారా తెలియుచున్నది.

కోటి త్రయంచ దేవానాం వైకుంఠే మధుసూదనం
ప్రపుల్ల నేత్రై: పశ ్యంతి ఆనందం పరమంపద
ప్రాప్నువంతి అత: తాం వై ఆనందాం ఋషయో విదు:
మోక్షానంత ప్రదాయస్మాత్‌ జ్ఞానానంద ప్రదాతనా
వివేకదా విమోకదా సైషా ఏకాదశీ మతా
అస్యాం నర: తధాభూమౌ ఉత్తర ద్వార మార్గత:
నారాయణం తధా దృష్ట్వా సాఫల్యం విందతే ధ్రువం
సఫలా నామ సాప్రోక్తా పుష్యమాస సితే దలే
అత: ఇయం సర్వ ఫలా పండితై రుచ్యతే అనిశం

ఈ ప్రమాణానుగుణంగా ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, సఫల ఏకాదశి, వివేక ఏకాదశి, మోక్ష ఏకాదశిగా వ్యవహరించెదరని తెలుస్తోంది.
వైకుంఠ ఏకాదశినాడు తెల్లవారుఝామునే లేచి, శిరస్నానం ఆచరించి, పరిశుద్ధమైన, ఏకాగ్రమైన మనస్సుతో పుణ్యక్షేత్రములలో లేదా సమీపంలోని దేవాలయమునకు వెళ్ళి ఉత్తర ద్వారము ద్వారా స్వామిని దర్శించుకొని శక్తికనుగుణంగా స్తోత్రపాఠములను భగవత్‌ గుణానుసంధానం చేసి తీర్థప్రసాదములు స్వీకరించి యధాశక్తి భగవన్నామ సంకీర్తనం చేయవలయును. అన్ని ఏకాదశుల వలే ఉపవాస జాగరణము తప్పక చేయాలి. ఈవిధంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి స్నానమాచరించి ఉత్తరద్వార దర్శనం, ఉపవాస జాగరణ, నామసంకీర్తన విధిని సక్రమంగా ఆచరించినచో పరమాత్మ అనుగ్రహం కలిగి ఇహపరములలో ఉత్తమ ఫలమును పొందవచ్చును. స్వామి అనుగ్రహం పొందితే నిత్య ఫలం, సత్య ఫలమని పురాణ వచనం.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement