గురువులు శిష్యుల ప్రతిభను అంచనా వేసి, ఎవరికీ వేటిని నేర్పించాలో తెలి సినవారు. అటువంటి గురువులలో సత్యకామజాబాలి ఒకరు. గౌతమ మహర్షి శిష్యుడై బ్రహ్మజ్ఞానాన్ని పొందిన గొప్ప ఋషి. గురు స్థానానికి చేరుకున్న జాబాలి తన ఆశ్రమానికి విద్యలు నేర్చుకునేందుకు విచ్చేసిన శిష్యులకు పన్నెండేళ్లపాటు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్లని వాళ్ల ఇంటికి పంపేసేవాడు. అలా ఉత్తీర్ణులైన విద్యార్థు లు గురువు అనుమతితో వివాహం చేసుకుని, అర్హతకు తగిన ఉపాధిని ఎంచుకుని, ధర్మమార్గంలో జీవితాన్ని సాగించేవారు. ఆవిధంగా జాబాలి ఆశ్రమానికి వచ్చినవా రిలో ఉపకోశలుడు ఒకడు.
పూర్వము ఒకప్పుడు కమలుని కుమారుడు- ”ఉపకోశల కామలాయనుడు” అనే ముని ఉండేవారు. ఆయన బాల్యములోనే సత్యకామ జాబాలి సన్నిధిలో బ్రహ్మచర్య వ్రతము స్వీకరించారు. సత్యకామజా బాలుడు పన్నెండేళ్ళు తన శిష్యులకు అధ్యాపన చేయించినా ఉపకోశలునికి మాత్రం శాస్త్రాలు చెప్పకుండా, వేదాధ్యయనమూ చేయిం చకుండా పన్నెండేళ్ల కాలం తన అగ్నులను సంరక్షించవలసినదని ఆదేశించాడు. ఇతరు లకు ఇది భేద దృష్టిగా కనపడినా, శిష్యుడు మాత్రం మారు పలకలేదు. గురువు ఆజ్ఞ ప్రకా రం ఏ విద్యాభ్యాసమూ లేక, అగ్ని రక్షణ మాత్రమే చేస్తూ నిశ్చింతగా ఉండిపోయాడు.
ఉపకోశలుడు సత్యకామ జాబాలి ఆశ్రమంలో చేరి పన్నెండు సంవత్సరాలు గడిచాయి. కానీ శిష్యుణ్ణి గురువు ‘నీ విద్యాభ్యాసం పూర్తయింది. ఇక నువ్వు వెళ్లవచ్చు’ అని ఏనాడూ చెప్పలేదు. ‘బహుశా గురు సేవలో నేను అనుచితంగా ప్రవర్తించానేమో’ అని శిష్యుడు మధనపడ్డాడు. ఇతర శిష్యులు సంవర్తనం పూర్తిచేసుకొని తమతమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. సంవర్తనం (విద్యాపరిసమాప్త వ్రతము) పూర్తికాగానే శిష్యుడు గృహ స్థాశ్రమ ధర్మం స్వీకరించవచ్చును. ఉపకోశలుడు మాత్రం గుర్వాశ్రమంలోనే వున్నాడు. అందరికీ ఈ శిష్యుని పట్ల గురువు అవజ్ఞ చేస్తున్నట్లు కనిపించేది.
ఒకరోజు గురుపత్ని ”ఏమండీ పాపం ఉపకోశలుడు ఎంతో భక్తిశ్రద్ధలతో మిమ్మల్ని సేవిస్తున్నాడు కదా! అతన్ని మీరు అనుగ్రహంచండి.” అని అడిగింది. ”దానికి ఇంకా సమయముంది” అని అగ్నిని సేవించమని శిష్యుణ్ణి ఆదేశించి, ఏదో పనిమీద కొన్నా ళ్లపాటు ఎక్కడికో వెళ్ళాడు జాబాలి. అతడు ఉపకోశలుని మరింత పరీక్ష చేయాలను కొన్నాడు కాబోలు. శిష్యుడు తన గొడవను మరచి, ”అయ్యో, గురుపత్ని మాట గురువు వినలేదు కదా! ఇదంతా నావలనే కదా”! అని మనసులో బాధపడ్డాడు.
ఈ విచారంలో అతడు భోజనం మానేశాడు. గురుపత్ని ‘నాయనా నీవెందుకు ఆహారం తీసుకోవడం లేదు?’ అని అడిగింది. శిష్యుడు ”నాకు మనసు సరిగాలేదు. ఆహా రం తినాలనిఅనిపించటం లేదు.” అన్నాడు.
ఉపకోశలుడు ‘అమ్మా! నా హృదయం ఇంకా పవిత్రం కాలేదు. స్వచ్ఛం కాలేదు. అందుకే గురుదేవులు నన్ను పరీక్షిస్తున్నారు. నా హృదయం పవిత్రమయ్యే దాకా నేను అన్నం ముట్టను’ అన్నాడు.
అప్పుడు అతని దీక్షకు మెచ్చుకుని అగ్నులు ఈ విధంగా అనుకొన్నారు. ”ఈ ఉపకోశలుడు ఇన్ని రోజులు మనకు పరిచర్యచేసి ఇపుడు ఆహా రం కూడా తీసుకోవటంలేదు. ఇంక ఆలస్యం చేయరాదు. ఇతనికి మనమే ఉపదేశమివ్వాలి”. త్రేతాగ్నులుమువ్వురూ, మొదట ఉమ్మడిగా నూ, పిదప ప్రత్యేకంగానూ ఉపకోశలునికి, అగ్ని విద్యా, ఆత్మవిద్యా బోధించారు.
”ఉపకోశలా! ప్రాణమే బ్రహ్మం, ఆనం దమే బ్రహ్మం, ఆకాశమే బ్రహ్మం అని తెలుసు కో’ అన్నాయి. ఉపకోశలుడు ‘ప్రాణం బ్రహ్మ మని తెలుసు కానీ ఆనందం, ఆకాశం బ్రహ్మ తత్వాలని తెలీదు’ అన్నాడు.
అగ్నులు హృదయాల్ని గురించి వివరిం చాయి. ‘హృదయ పద్మంలోనే బ్రహ్మ తత్వ ముంటుంది. ఆ తత్వం యొక్క అసలు రూపమే ఆనందం’ అని వివరించాయి. ఉపకోశలుడు సంతోషించాడు.
ఈ త్రేతాగ్నులు ప్రాణమే బ్రహ్మ స్వరూ పమని, అది హృదయంలో చేరినప్పుడు కలిగే ఆనందం, ఆ ఆనందానికి ఆలంబనగా నిలిచే ఆకాశం కూడా బ్రహ్మ స్వరూపాలేనని వివరిం చాయి. శాశ్వత ఆనందానికి నిలయమైన హృద యాకాశాన్ని బ్రహ్మస్వరూపంగా ధ్యానించే ఉపాసనా మార్గాన్ని అనుసరించమని బోధించాయి.
అగ్ని, భూమి, సూర్యుడు, అన్నం ఈ నలుగురు నా శరీరంలో భాగమే అని తనను ఉపాసించే విధానాన్ని గార్హపత్య అగ్ని తెలియచెప్పింది.
చంద్రుడు, నక్షత్రాలు, నీరు, దిక్కులు విస్తరించిన బ్రహ్మతత్వం, అందరిలో ఉన్న తత్వం ఒక్కటే. అవి తన శరీరాలని చెప్పి వాటిని ఏవిధంగా ఉపాసించాలో వివరించింది ద్వితీయాగ్ని (దక్షిణాగ్ని). ప్రాణము, ఆకాశము, ద్యులోకము, విద్యుత్ ఈ నాలుగు నా శరీర భాగాలు అని తెలియచేసిన ఆహవనీయాగ్ని తనను ఆరాధించే విధానాన్ని బోధించింది. అగ్నులు ఉపకోశలునికి వేదాంత పరమైన భాగం మాత్రం అతనికి బోధించి, ”నాయనా! దీనికి పిదప నీకు ఆత్మానుభూతికి కావలసిన విధానాన్ని, క్రియను నీ ఆచార్యుడే ఉపదేశిస్తాడు.” అని అనుగ్రహంచారు.
దాంతో ఉపకోశలుడి అంతరంగం ఉల్లాస తరంగితమైంది. అంతవరకు ఉన్న అడ్డంకులు, సందేహాలు తొలగిపోయి ఏదో దైవాంశ తనను స్పర్శిస్తున్నట్లు పరవశిం చాడు. కొన్నాళ్లకు సత్యకామ జాబాలి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.
ఉపకోశలుని వదనం దేదీప్యమానంగా వెలగడం చూసి అతనిలో కలిగిన పరివర్తనకు సంతోషించాడు. ఇంత తీవ్రంగా శిష్యుని పరీక్షిస్తున్నా గురువుకు శిష్యుని యందు వాత్సల్యం గానీ, శిష్యునికి గురువు యందు భక్తిగానీ సడలలేదు.
గురువు శిష్యుని ముఖం చూచినపుడు- అతడు మహాతేజస్విగా కనబడగా, ”నాయనా! నీకెవరు ఉపదేశించారు?” అని శిష్యుణ్ణి అడిగాడు. ”ఈ అగ్నులు తప్ప నాకెవరు వేరే ఉపదేశం ఇవ్వగలరు? కానీ ఈ అగ్నులు అప్పుడు ఇప్పుడున్న రీతిలోలేరు. వేరే విధంగా కనబడ్డారు”
సత్యకాముడు సంతోషించి ‘నువ్వు నేర్చుకున్నది, నేను నేర్పాలనుకున్నది అదే. అగ్నులు నీకు సత్య రహస్యాన్ని వివరించాయి. నువ్వు ధన్యుడవు. తామరాకును నీరు అంటనివిధంగా బ్రహ్మజ్ఞాన ప్రభావము చేత ఈ ఇంద్రియ దృశ్య వ్యవహారములేవీ నిన్ను స్పృశించజాలవు. బ్రహ్మ మార్గం ద్వారా ప్రయాణించి, మరో జన్మంటూ లేని సత్య లోకాన్ని పొందే అంతిమ ఉపాసనను ఉపకోశలుడికి తెలియచేసి పరిపూర్ణ సాధకుడిగా తీర్చిదిద్దాడు. నీ విద్య సమాప్తమైంది. ఇక నీవు నీ ఇంటికి వెళ్లవచ్చు’ అని ఉపకోశలుడిని ఇంటికి పంపేశాడు.
ఈ కథ ఆచార్యుడెంత అవసరమో తెలియచేస్తుంది. ఆచార్యుని ముఖత: వచ్చిన ఉపదేశమే ఫలవంతం కాగలదు అని ఛాందోగ్యోపనిషత్తు చెబుతోంది.
ఉపకోశల విద్య
Advertisement
తాజా వార్తలు
Advertisement