మిథున రాశి
ఆదాయం – 05, వ్యయం- 05
రాజ్య పూజ్యం – 03, అవమానం-06
గురువు ఉగాది నుండి 01.5.2024 వరకు 11వ స్థానమై శుభుడైనందున అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభముంటుంది. 02.05.2024 12వ స్థానమై అశుభుడైనందున ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా
ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా
జాగ్రత్త అవసరం.
శని ఉగాది నుండి వత్సరాంతం వరకు 9వ స్థానమై అశుభుడైనందున మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
రాహువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 10వ స్థానమై సాధారణ శుభుడైనందున మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
కేతువు ఉగాది నుండి వత్సరాంతం వరకు 4వ స్థానమై అశుభుడైనందున కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. జాగ్రత్తగా నుండుట మంచిది.