భక్తి వేరు. భక్తి పెంపొందించే సాధనాలు, ఉపకరణాలు వేరు. స్థూలంగా రెండూ ఒకటే అని మనం అనుకుంటు న్నాం. పూజలు, నోములు, వ్రతాలు చేయటం భక్తి కాదు. మనలో భక్తి పెరగడానికి, భక్తి పెంపొందడానికి చేసే సాధనలు. భక్తిని అలవాటు చేసుకోవడానికి చేసే అభ్యాసాలు, ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు, ఉపవాసాలు, నైవేద్యాలు, పారాయణలు, జాగరణలు కూడా భక్తికాదు. భక్తి సాధనామార్గంలో మనం ఉప యోగించుకునే, మనకు ఉపయోగపడే ఉపకరణాలు. అయితే భక్తి అంటే ఏమిటి? ఏది నిజమైన భక్తి. భక్తితత్త్వం అంటే ఏమిటి? భగవంతుడ్ని ప్రేమించటం, భగవంతుడు కోసం అర్రులు చాచటం, ఆరాటం పడటం భక్తి. భగవంతుడి కోసం పరి తపించడం, తపన పడటం భక్తి. భగవంతునికి అన్నింటినీ అర్పణ చేయడం. కష్టంలోను, కన్నీళ్లలోను, బాధలలోను, ప్రతి స్థితిలో భగవంతుణ్ణి దర్శించగలగటం. హృదయంలో ఉంచుకోగలగ టం భక్తి. భగవంతుడి కోసం వేదన పడటం, రోదన చేయటం భక్తి. ఓ దేవాలయంలో ఓ పండితుడు ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తున్నారు. భగవద్గీత శ్లోకాలను ముందుగా పండితుడు చదు వుతున్నారు. పండితుడు చదివిన శ్లోకాన్ని అంద రూ అనుకరిస్తున్నారు. భగవద్గీత గ్రంథాన్ని చేతిలో పట్టుకుని అందరూ ఆ పండితుడు చెబు తున్న వ్యాఖ్యానాన్ని శ్రద్ధ³గా వింటున్నారు. సన్నివేశానికి అనుగుణంగా, సందర్భానికి తగ్గట్టుగా ఓసారి నవ్వుతున్నారు. మరోమారు తలలు ఊపుతున్నారు. మరుక్షణంలో ఆశ్చర్య పోతున్నారు. అంతలోనే ఆనంద పడి పోతున్నా రు. భగవద్గీత పుస్తకం పేజీలు తిప్పుతున్నారు. చెబుతున్న సన్నివేశానికి అనుగుణంగా ప్రవర్తిస్తు న్నారు. అందరూ ఆనంద పారవశ్యంలో తేలిపోతున్నారు. ఓ మూలన కూర్చున్న ఓ వ్యక్తి ఇదేమీ పట్టనట్టు కంటికీ మంటి కీ ఏకధారగా ధారాపాతంగా కన్నీరు కారుస్తున్నాడు. ఆ వ్యక్తి దగ్గర కు ఒకాయన వెళ్ళి, ”ఏమయ్యా! ఇందాక ట్నుంచి చూస్తున్నాను. భగవద్గీత పారాయణం ఆనంద పారవశ్యంలో సాగిపోతోంది. ను వ్వు మాత్రం ఆపకుండా ఏకబిగిన ఏడు స్తున్నావు. కారణమేంటి?” అని అడిగాడు. ఆ వ్యక్తి యిలా సమాధానం చెప్పాడు. ”అయ్యా! నాకు చదువు లేదు. సంస్కృత శ్లోకాలు పలకటం రాదు. అందువల్ల నేను ఏమీ పట్టించుకోకుండా ఊరకే కూర్చుని ఉన్నాను. గీతను బోధిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ చిత్రాన్ని హృదయంలో చిత్రించుకుని, గీతను అర్జునునికి బోధిస్తున్న ఆ కృష్ణుని స్థితిని తలచుకుంటున్నాను.” అని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ”కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అర్జునునికి గీతను బోధించాడు కదా! పైగా రథంపై సారధిగా తాను ముందుం డి, వెనుకన ఉన్న అర్జునునికి కర్తవ్య బోధ చేసా డు. అంటే తన వెనుకన ఉన్న అర్జునునికి బోధ చేయటానికి, కృష్ణుడు తన తలను వెనకకు తిప్పి బోధ చేసాడు. ఆవిధంగా తల వెనకకు తిప్పి గీతను బోధించేటప్పుడు, ఎంతటి మెడనొప్పి వచ్చి ఉంటుందో కదా! అంత మెడనొప్పిని ఆ కృష్ణుడు ఎలా భరించాడో అని తలుచుకుని బాధ పడుతున్నాను. అందువల్లనే కన్నీళ్లు వస్తున్నాయి..” అన్నాడు.
భగవంతుడు బాధపడుతున్నాడనీ భగవంతుడు పడుతున్న ఆ బాధను అనుభవిస్తున్న ఆ వ్యక్తిదే నిజమైన భక్తి అని అర్ధమైంది. భగవంతుని కోసం కంటికీమంటికీ ఏకధారగా ఏడుస్తున్న అతనే అసలు సిసలు భక్తుడు అని కూడా అర్థం అయ్యింది.
భగవంతుడు మన కోసం పడే ప్రతి అవస్థను అనుభవం లోనికి తెచ్చుకొన్నవాడే నిజమైన భక్తుడు. అతనిదే అసలుసిసలైన భక్తి. అదే ఉత్కృష్టమైన భక్తితత్త్వం. అర్ధం చేసుకొని అనుభవం లోనికి తెచ్చుకోవడమే నిఖార్సయిన అసలు సిసలైన భక్తి.
– రమాప్రసాద్ ఆదిభట్ల, 93480 06669