Monday, November 25, 2024

రేపు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల : తిరుమలలో రేపు (ఫిబ్రవరి 5వ తేదీ) పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఫిబ్రవరి 5న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి …
తిరుమల దివ్య క్షేత్రంలో ఫిబ్రవరి 5వ తేదీ శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది. పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థము, కూమారధార తీర్థము, తుంబురు తీర్థము, శ్రీరామకృష్ణ తీర్థము, ఆకాశగంగ తీర్థము, పాపవినాశన తీర్థము, పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించిన యెడల భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని ఆర్యోక్తి. ”శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి” ప్రతి ఏటా మాఘ మాసం నందు నిర్వహించడం ఆనవాయితి. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది. పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ ఆర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణాను సారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడను మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు. ఈ తీర్థ తీరమున నివసించుచూ, స్నానపానాదులు చేయుచూ, శ్రీమహావిష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందెను. ఎవరైన మానవులు అజ్ఞానంతో తల్లి దండ్రులను, గురువులను దూషించినందు వల్ల కలిగినటువంటి దోషమును, ఈ పుణ్యతీర్థమునందు స్నానమాచరించుట వలన ఆ దోషము నుండి విముక్తి పొంది సుఖముగా జీవించగలరని ప్రాశస్త్యం. ఈ పర్వదినం నాడు ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామగ్రిని తీసుకు వెళ్ళి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసివున్న శ్రీరామచంద్ర మూర్తి మరియు శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టిటిడి అధికారులు, భక్తులు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement