Thursday, November 21, 2024

తిరుప్పావై ప్రవచనాలు.. పాశురము : 24

24వ పాశురము
పాశురము : 24

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

అన్ఱి వ్వులగ మళన్దాయ్‌! అడిపోత్తి;
చ్చెన్ఱఙ్గు త్తెన్నిలఙ్గై శెత్తాయ్‌! తిఱల్‌ పోత్తి;
పొన్ఱ చ్చగడ ముద్దెత్తాయ్‌; పుగళ్‌పోత్తి;
కన్ఱు కుణిలా వుఱిన్దాయ్‌! కళల్‌పోత్తి;
కన్ఱుకుడై యావెడుత్తాయ్‌! గుణమ్‌ పోత్తి;
వెన్ఱు పగై కెడుక్కుమ్‌ నిన్‌కై యిల్‌ వేల్‌ పోత్తి;
ఎన్ఱెన్ఱున్‌ శేవగమే యేత్తిప్పఱౖ కొళ్వాన్‌
ఇన్ఱి యామ్‌ వన్దోమ్‌ ఇరఙ్గే రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

- Advertisement -

తాత్పర్యము :
” ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను బంధించగా ఈ త్రైలోక్య రాజ్యమును బలినుండి దానముగా గ్రహించి పాదములతో కొలిచిన మీ దివ్యపాదార విందములకు మంగళము.
రావణాసురుడు సీత నపహరించగా రావణుని నివాసమగు లంకకేగి సుందర భవనములు, కోటలు గలది, దక్షిణదిశ యందునున్న లంకానగరమును ధ్వంసము చేసి అచటి రాక్షసులను సంహరించిన మీ బాహుబలమునకు మంగళము.
శ్రీ బాలగోపాలుని రక్షణకై యుంచిన బండిలో ఆవేశించిన రాక్షసుని వధించుటకు బండికి తాకునట్లుగా కాలు చాచి నేలకూల్చిన మీ అసమాన కీర్తికి మంగళము.
దూడ రూపముతో వచ్చియున్న రాక్షసుడు దారిలో నున్నకపిత్థాసురుడు(వెలగచెట్టు) నీకు కీడు చేయ సంకల్పించి రాగా దానిని తెలిసిన నీవు వత్సాసురుని ఒడిసెలరాయి విసిరినట్లుగా వెలగచెట్టుపైకి విసిరినపుడు ముందు వెనుకలకు వంచి ఉంచినమీ దివ్యపాదములకు మంగళము.
ఇంద్రుడు తన యాగమును భంగ పరిచినందుకు కోపించి రాళ్ళ వాన కురియగోపాలురను గోవులను కాపాడుటకు గోవర్ధన పర్వతమును గొడుగుగానెత్తిన మీ వాత్సల్యమునకు మంగళము.
శత్రువులను సమూలముగా నశింపచేసి విజయమును తెచ్చిపెట్టు నీ చేతిలోని వేలాయుధమునకు మంగళము. ఇట్లు నీ పలు వీరచరితములను నోరారా స్తుతించి మా నోమునకు కావలసిన పర గైకొనుటకు ఈనాడు వచ్చియున్నాను. మమ్ము అనుగ్రహించుము.”
ఈ పాశురము ‘మంగళాశాసన పాశుర’ మని ప్రసిద్ధి. గోపికలు కోరినట్లుగానే శ్రీకృష్ణభగవానుడు శయ్యామందిరము నుండి సభా మందిరమునకు నడిచి వచ్చి సింహాసనమున కూర్చొనెను. అపుడు ఎర్రబారి క ందిన అతని పాదములను చూచిన గోపికల హృదయము కలత చెందినది. ఆ స్వామికి క్షేమము. శుభము కలుగవలయునని మంగళము పాడుచున్నారీ పాశురమున. అమంగళములు తొలగి మంగళములు కలుగ వలయునని కోరుటను మంగళాశాసనమందురు.
ఇది చూచుటకు ఇతరులకు పిచ్చి పనివలె కనిపించును. కాని విశష్టాద్వైత సిద్ధాంతమున ఇది అత్యంత ముఖ్య కార్యము. ఆచార్యులు శిష్యులను స్వీకరించుట భగవన్మంగళా శాసనపరుల అభివృద్ధి కొరకే అని ‘శ్రీవచన భూషణము’ న నిశ్చయింప బడినది.ఈ మంగళాశాసన కైంకర్యము భక్తులకు ప్రపన్నులకు తప్ప ఇతరులకు తెలియరాని పరమ రహస్యము.
చేతనునకు రెండు దశలుండును. జ్ఞానదశ ప్రేమ దశయని . జ్ఞానదశలో అతని రక్షణను కోరెదము. ప్రేమదశలో అతనికి మనమే రక్షణను కోరెదము. ప్రేమదశలో అతనికి మనమే రక్షకులమని భావింతుము. ఈ ప్రేమ దశలో చేయునదే మంగళాశాసనము.
‘ఉపదేశరత్నమాల’ లో వరవరమునులు.
‘మంగళాశాసనత్తిన్‌ మత్తుళ్ల ఆళ్వార్‌ కల్‌ ‘
అను పాశరము శ్రియ:పతికి మంగళాశాసనముచేసినందున ఇతరళ్వారులు కంటే శ్రీ విష్ణుచిత్తులకు పెరియాళ్వారుగా పేరొచ్చెను అని సాధించిరి. ఈ నియమాను సారముగానే లక్ష్మణుని ‘ఇళై పెరుమాళ్‌’ అని గుహుని ‘గుహపెరుమాళ్‌’ అని వ్యవహరించుచున్నారు.
శ్రీమద్రామాయణమున బాలకాండలో దశరథుడు, జనకుడు,విశ్వామిత్రుడు, అయోధ్యావాసులు,కౌసల్యదేవి, అయోధ్యకాండలో – సీతాపిరాట్టి, అరణ్యకాండలో ఋషులు – జటాయువు, కిష్కింధ కాండలో – ఆంజనేయులు, శ్రీవిష్ణుపురాణమున నందగోపుడు,వసుదేవుడు, దేవకి, శ్రీమన్మహాభారతమున – విదురుడు, ధర్మరాజు, భీష్ముడు.
ఇట్లే ఇతరత్రా ధనర్దాసు మెదలగువారు మంగళా శాసనమును గివించియున్నారు.
ఇచట ‘బలి’ యనగా అహంకారము. అహంకార మమకారములు ప్రకృతికి కవల పిల్లలు. తల్లి సొత్తగు ప్రపంచమును ఆక్రమించి తమదేయని గర్వించు చుందురు. వాస్తవముగా ఇదంతయూ పరమాత్మది. ఇట్టి అహంకారమును తొలగించునది శ్రీపాదరేణువే. ఇదియే మొదటి పాదమునకు అంతరార్ధము. అనగా శ్రీపాదసుధను గోలిన భక్తులకు అహంకార మమకారములుండవు.
కేవల అహంకారమును తొలగించిన చాలదు. అహంకారమునకు పుట్టిల్లగు ప్రకృతి కూడా తొలిగిపోవలె. అదియు రెండవ పాదములో చెప్పబడుచున్నది.
ఇచట లంకయనగా శరీరము. ఆ శరీరములోని మనస్సేరావణుడు. ఆ రావణుని పది తలలే పది ఇంద్రియములు. పరమాత్మ మన శరీరమునందు అంతర్యామియై,అహంకారము పుట్టు మనమును విషయభోగములకు పనికి రాకుండగా పాడుచేసి, ఆ మనసును పాలించు రాజసమను రావణుని చంపి సాత్త్వికమను విభీషణుని నిలిపి తననుకొలుచునట్లు చేయుటే లంకా వృత్తాంతము.
దేహాత్మ వివేకము లేనపుడే అహంకార ముదయించును. అవిద్యా సంబంధము వలననే మన కు అవివేకము కలుగును. అనగా వివేకము తొలగును. అవిద్యా సంబంధముచే కర్మ కలుగును. ఆ కర్మను నశింపచేయుటయే శకటాసుర వృత్తాంతము.
‘బండి’ మనను ఒకచోట నుండి ఇంకొక చోటికి చేర్చును. ఆత్మను ఒక శరీరము నుండి వేరొక శరీరమునకు చుర్చునది కర్మయే కదా. దీని రెండు చక్రములు ఉత్తర పూర్వాషుములు. ‘శం కటయతి’ అనగా సుఖమును నశింపచేయునది అని అర్థము.
ఈ కర్మ భగవత్పాదస్పర్శతోనే తొలగును.
అహంకారము, కర్మ నశించిననూ రుచి వాసనలు నశించ వు. లోపల రుచి వాసన రూపముగా నుండి సమయమునకు బయటపడును.
ఇచట రుచి -వత్సాసురుడు – దూడ ప్రతి దానిని రుచి చూచుచుండును.
వాసన – కపిత్థాసురుడు- కపిత్థమనగా వెలగపండు, వెలగపండు వాసన సుప్రసిద్ధమే కదా. మొదట రుచి, తరువాత వాసన నశించవలయును. అనగా రుచితో వాసన తొలగ వలయును. వత్సాసురునితో కపిత్థాసురుని సంహరించుటలోని ఆంతర్యము ఇదే.
ఇక గోవర్ధనము నెత్తుట లోని ఆంతర్యము చూతము. దేవేంద్రుడు కురిపించిన రాళ్ళవాన అనగా విషయ వ్యామోహము. ఒక్కొక్క రాయిఒక్కొక్క ప్రాణిని చంపును. ఒక్కొక్క విషయము ఒక్కొక్కని నశింప చేయును. విషయ వ్యామోహము నశింపచేయకుండ వలయుననగా గోవర్ధన మెత్తవలయును. గోవర్ధన మెత్తుట యనగా గోవు అనగా వాక్కు, వర్ధనమనగా పెంచుట,వాక్కును పెంచుట యనగా ‘రాముడను నేను’ ‘కృష్ణుడను నేను’ అనెడి భావము తొలి ప్రతి పదము శరీరము వరకు మాత్రమే కాక ఆత్మ వరకు వెళ్ళవలయును. అటునుండి పరమాత్మ వరకు వెళ్ళవలయును. అనగా ప్రతివస్తువు నందు ప్రకృతి’జీవుడు’ పరమాత్మయందురు. రాముడు అనగా రామరూప శరీరముతో చేరియున్న ఆత్మకంతర్యామి యైన పరమాత్మ అని అర్థము. ఇట్లు వాక్కునకు అర్థమును పరమాత్మ వరకు తెలిసిన నాడు విషయ వ్యామోహము తనకు తానుగానే నశించును. అనగా హాని చేయజాలదు. ఇదియే గోవర్ధన వృత్తాంతము.
శ్రీకృష్ణుడు భగవానునిగానే కాక ఆచార్యునిగా కూడా ఉపదేశము చేసెను కదా! కావున శ్రీకృష్ణుని చేతిలోని వేలాయుధము ఆచార్యుని ఉపదేశముద్ర. ఈ ఉపదేశము సర్వము పరమాత్మాత్మకముగా బోధించును. కాన శత్రుత్వ భావన ఎటులుండును. శత్రుత్వ భావన తొలగుటయే శత్రునాశము అర్థము.
ఈ పాశురమున ‘పోత్తి’ అని ఆరుమార్లు చెప్పిరి. భోజనమున షడ్రసములు ఆనందము నిచ్చినట్లు. ఇచట ఆరు మారులు స్తుతించిన ఆనందము కలుగును. ఆరు రుచులున్నట్లే మనకు అరిషడ్వర్గమున్నది. ఒక్కొక్కటి తొలగుటకు ఒక్కొక్క పోత్తి అని తెలియవలయును. శత్రునిర్మూలనమే అంతరార్ధమని తెలుపుటకే చివరికి శత్రువుల విషయము నుదహరించిరని తెలియవలయును.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement