పాశురము : 9
ఆండాళ్ తిరువడిగలే శరణం
తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
తూపమ్ కమళ త్తుయిలణౖ మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్
ఊమైయో? అన్ఱి చ్చెవిడో? అనన్దలో
ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?
”మామాయన్, మాదవన్, వైగున్దన్”ఎన్ఱెన్ఱు
నామమ్ పులవుమ్ నవి న్ఱేలోరెమ్బావాయ్!
ఆండాళ్ తిరువడిగలే శరణం
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళశాసనములతో…
తాత్పర్యము :
ఇందులో లేపబడు గోపిక అద్దాలమేడలో పరుండి యున్నది. ఈ మేడ ” పరిశుద్ధములగు నవవిధ మణులతో నిర్మించబడినది. ఈ మేడలో సుఖశయ్యపై చుట్టు దీపములు వెలుగుచుండగా అగురు, ధూపము పరిమళించుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్తకూతురా! మణికవాటపు గడియ తీయుము. ఓ అత్తా! నీవైననూ ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక జాడ్యము కలదా? ఎవరైనా కదలిన ఒప్పమని కావలియున్నారా? గాఢనిద్ర పట్టునట్లు మంత్రించినారా? ‘మహామాయావీ! మాధవా! వైకుంఠ వాసా! అని అనేక నామముల కీర్తించి ఆమె లేచునట్లు చేయుము. ”
మణులు తొమ్మిది విధములు. భగవంతునితో జీవునకుండు సంబంధము తొమ్మిది.
1. పిత, 2. రక్షకుడు, 3. శేషి, 4. భర్త, 5. జ్ఞేయుడు, 6. స్వామి, 7. ఆధారము, 8. ఆత్మ, 9. భోక్త. ఈ తొమ్మిది సంబంధములతో పరమాత్మను భావించుట ‘ ప్రజ్ఞ’ యనబడును. ఈ ప్రజ్ఞయే మణిమయ భవనము. చుట్టు దీపమనగా శాస్త్రము వలన కలిగిన జ్ఞానదీపము. అగరుధూపమ పరిమళమనగా జ్ఞానము మాత్రమే కాక అనుష్ఠానమును కూడా సూచించును. భగవంతునిపై పరిపూర్ణముగా భారముంచుటయే హాయిగా నిద్రించుట. మణులతో నిర్మించిన తలుపులనగా వ్యామోహ జనకములగు అహంకార మమకారములు. ఇవి ఆచార్య కటాక్షముచే మాత్రమే తొలగును. భగవంతుని యందు దృఢాధ్యవసాయము కలవారు మూగవారుగా చెవిటివారిగా బద్ధకస్తులుగా కనపడుదురు. వీరిని మంత్రించునది కావలి యుండునది భగవంతుడే. వీరు ఇతర విషయములను పట్టించుకొనరు.
ఈ పాశురమున తిరుమళిశయాళ్వార్లును మేల్కొలుపుచున్నారు. ఇచట ‘ మామాన్ మకళే’ అనికదా సంబోధన. గోదను లక్ష్మికి తోబుట్టువుగా చెప్పుచున్నందున లక్ష్మి భృగుమహర్షి పుత్రిక, ఈ యాళ్వార్లు కూడా భృగువంశ సంజాతులే. కావున వీరు ‘మామాన్ మగలే’ అగుదురు. ఇక ఆళ్వారు తమనుచూచి వేదపాఠమును ఆపిన బ్రాహ్మణులు తాము ఆపిన భాగమున మరచిపోగా వీరు నోటితో చెప్పక ఒక నల్లని ధాన్యము గింజను గోటితో గిల్లి పారవేసి ‘కృష్ణానాం వ్రీహీణాం న ఖనిర్భిన్నం’ అను మంత్రమును గుర్తు చేసిరి. ఇది వీరి మూగతనము. ‘ఉపయో’ అనికదా ఇచట చెప్పినది.
ఇక గురు పరంపరలో ‘శ్రీమతే రామానుజాయ నమ:’ ‘జ్ఞాతార స్తనయా:’ అనుట వలన ఆండాళ్ అందరికి తల్లి. ‘ భ్రాతా చేత్ యతిశేఖర:’ అని భగద్రామానుజులు ఆండాళుకు అన్నగారు. కావున మనకు యతిశేఖరులు మామకదా. పరంత్రులు కావున ‘మగళే’ కూడా. ఇట్లు పాశరమున ‘శ్రీమతే రామానుజాయ నమ:’ అను వాక్యము బోధించబడినది.