పాశురము : 29
ఆండాళ్ తిరువడిగలే శరణం
శిత్తుమ్ శిఱుహాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్,
పెత్త మ్మేయ్‌త్తుణ్ణు ఙ్గులత్తిల్ పిఱన్ద నీ
కుత్తేవ లెఙ్గళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తై ప్పఱౖ కొళ్వా నన్ఱుకాణ్; గోవిన్దా!
ఎ త్తైక్కు మేళేళుపిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్‌వోమ్,
మత్తై నఙ్గామఙ్గళ్ మాత్తే లోరెమ్బావాయ్
ఆండాళ్ తిరువడిగలే శరణం
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో…
తాత్పర్యము :
” చిన్నపిల్లలు అందులో ఆడపిల్లలు లేవజాలని చలికాలమున తెల్లవారుటకు ముందు అనాదియగు అజ్ఞానాంధకారము తొల గి భగవద్విషయమగు జ్ఞాన ప్రకాశము కలుగు కాలమున, అనగా చిట్టి వేకువలో లేచి నీవు వేంచేసియున్న చోటునకే మేము వచ్చి, నిన్ను సేవించి, అనగా పూజాద్రవ్యములను దాల్చి, పెరుమాళ్ళ సన్నిధికి చేరెదము అనుమాటనే అధికముగా భావించు నిన్ను అని తాత్పర్యము. మిక్కిలి విలువ గలవియై భోగ్యములై బంగారు తామరపూవులవలె సుందరములు స్పృహణీయములు అయిన నీ పాదములకు మంగళము పాడుటలో అభిప్రాయమును వినుము.
ఎల్లపుడును వేదములలో మాత్రమే వినబడు నీవు పశువులను మేపుకొని జీవించవలసిన గొల్లజాతికి వచ్చి పుట్టి మా సేవను స్వీకరించి యుండరాదు. మా చేత ఆంతరంగిక కైంకర్యములను స్వీకరించి తీరవలయును. శబ్దాది విషయములే శరీరమున నిలబెట్టు సాధనములుగా గలిగియున్న మాకు నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యమును జూచి తిను అన్నము, త్రాగు నీరు, నములు తాంబూలము అన్నియునూ ఆశ్రిత సులభుడవైన నీవే స్వామీ అనునట్లు చేసి మా స్వరూపానుగుణమగు కైంకర్యము నొసంగకుండుట నీకు తగదు.
నీ నుండి పరను పుచ్చుకొనుటకు వచ్చిన వారము కాదు. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారము కావలయును. నీకు మాత్రమే సేవలు చేయువారము కావలయును. మాకు ఇతరములైన కోరికలేమియు లేకుండునట్లు అనుగ్రహించుము. ”
మార్గశీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతితో వర్షమునకైచేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము. పెద్దల తృప్తికొరకు తాము స్నానవ్రతము నాచరింతుమనియు, ఆ వ్రతమునకు పరయును వాద్యము కావలయునని బయలుదేరి శ్రీకృష్ణుని సన్నిధి చేరి ఆ వరనిచ్చి తమకావ్రతమును పూర్తి చేయించి ఫలముగా అలంకారములను పరమాన్నభోజనమును చేయింపుమని ప్రార్థించిరి.
ఇది వారి మనసులోని అసలు మాట కాదు. శ్రీకృష్ణ భగవానునితో కలసి ఎడబాటు లేకుండగా స్వామికి కైంకర్యము చేయవలయుననియే అసలు అభిప్రాయము. స్నానమనగా భగవత్ప్రాప్తి. పరయనగా భగవత్కైకర్యమని వారి అభిప్రాయము.
ఈ వ్రతమును భగవంతుని చేరవలయునని కోరు వారందరు చేయదగిన వ్రతము. వ్రతమును ఆచరించుటకు ముందుగ భగవత్సంబంధులతో సంబంధమేర్పరుచుకొనవలయును. దాని తరువాత శమదమాది ఆత్మగుణోపేతులై ఆచార్య సమాశ్రయణమును గావించవలయును. తరువాత మంత్రోపదేశమునొంది మంత్రార్థమును తెలియవలయును. ఉపాయము భగవంతుడైనను జీవులు సర్వేశ్వరు నాశ్రయించునపుడు ఇద్దరిని కలిపెడి అమ్మ వారిని ఆశ్రయించవలయును. ఆమె ద్వారా స్వామియే ఉపాయమని నిశ్చయించుకొని స్వామి కటాక్షపాత్రులు కావలయును. తరువాత స్వామిని దర్శించి మంగళా జ్ఞానాదులను అపేక్షించి ముక్తులమై, బ్రహ్మాలంకారాద్యలంకృతులమై నిన్ను చేరి సాయుజ్యము నొందవలెనని ప్రార్థించవలయును. ఇదియే సంసారము నుండి విడివడి భ గవానుని చేరి భగవదనుభవము వరకు చేయవలసిన ప్రక్రియ. ఈ ప్రక్రియనే ఈ 27 పాశురములలో చెప్పియున్నారు.
ముఖ్యముగా తెలియదగిన రెండు విషయములను 28,29 పాశురములలో వివరించి వ్రతమును ముగించుచున్నారు. 30వ పాశురమున ఫలమును వివరించిరి.
28వ పాశురమున ఉపాయము శ్రీకృష్ణుడే అని దృఢముగా చప్పి తమకు తాముగా ఆర్జించుకొనిన జ్ఞానము సత్కర్మాచరణము లేదని నిర్హేతుక కృపతో తమ కులమున పుట్టిన శ్రీకృష్ణుడే తమ పుణ్యమని అతనికి తమకు విడదీయరాని సంబంధము కలదని మేము అతనివారమని, తమను స్వామి అయిన అతనే కాపాడి పురుషార్ధమును ప్రసాదించగలడని చెప్పి యున్నాడు.
29వ పాశురమున ఫలమును తెలుపుచున్నారు. ఈ ఫలమును పొందగల అర్హత తమకే కలదని ‘నమక్కే’ అని తెలిపి ఈ అర్హతనే ఈ చివరి రెండు పాశురములలో తెలుపుచున్నారు.
అనన్య భోగ్యత్వము, అనన్యోపాయత్వము,అనన్యార్హత్వము ఈ మూడు జీవుని స్వరూపములు.
అనగా భగవానుడే తప్ప ఇతర విషయములననుభవింపవలెనను కోరిక లేకుండట( అనన్య భోగ్యత) భగవానుని పొందుటకు భగవానుడు తప్ప ఇతరము ఉపాయము కాదని నమ్మి యుండుట(అనన్యో పాయత్వము) భగవానునికి తప్ప ఇతరునికి తానే విధముగను చెందకుండుట(అనన్యార్హత్వము) ఇవియే జీవుని లక్షణములు. ఇవి కలవారే భగవత్ప్రాప్తికి అర్హులు.
ఈ వ్రతమున గోపికలు రెండుమారులు తమ పరిశుద్ధుని వివరించిరి. ఆ రెండు ఉపాయ పరిశుద్ధి ఫలపరిశుద్ధి. ఈ రెంటిని ఈ రెండు పాశురములలో తెలుపుచున్నారు.
భగవానుడే ఉపాయము అని భావించిన వారికి తాము చేసి కర్మజ్ఞాన భక్త్యాదులో ఉపాయ భావనారుచి, వాసనలతో లేకుండ పోవలయును. అంతేకాదు భగవానుని ఉపాయముగా స్వీకరించుట, ఉపాయమనెడి బుద్ధి కూడా ఉండరాదు. అటువంటి భావన మనమునున్నచో శవస్పర్శచే వలె అపవిత్రత ఏర్పడును. ఇలాంటి అపవిత్రత లేకపోవుట ఉపాయ పరిశుద్ధి.
భగవంతుని పొంది భగవత్కైంకర్యమును చేయుటయే ఫలము. ఆ భగవత్ప్రాప్తిలో వేరొక ప్రయోజనమును సాధించుకోవలయుననుకొనుట లేదా సాధించి వెళ్ళుట ఒక అపవిత్రత. ఆ భగవత్కైంకర్యము తన ప్రీతికే అనుకొనుట రెండవ అపవిత్రత. ఈ రెండు అపవత్రతలలో భగవదనుభవమును పొందుట విషాహార మును లేదా ఎంగిలిని తిన్నట్లు దోషకార్యమగును. ఆ దోషములు లేకుండుటచే ఫలపరిశుద్ధి.
గోపికలకు ఈ రెండు పరిశుద్ధులు కలవు. 28వ పాశురమున ఉపాయపరిశుద్ధిని తెలిపిరి. ఈ పాశురమున ఫలపరిశుద్ధిని వివరించుచున్నారు.
ఇట్లు వెనుకటి పాశురమున ఈ పాశురమున ఉపాయ విరోధి, స్వరూప విరోధి ప్రాప్తి విరోధి, ప్రాప్య విరోధియను నాలుగు విరోధులు పరిహరించబడినవి, వెనుకటి పాశురమున జ్ఞానము మొదలగు ఇతరోపాయములు తమకేవియు లేవని చెప్పుటచే భగవానుడే ఉపాయమును నిశ్చయమునకు ప్రతి బంధకములైన ఉపాయాంతర సంబంధము తెలిపిరి.
భగవంతుని చేరుటకు వెనుక చేసిన అపరాధములు ప్రతిబంధములుగా నిలువకుండగా క్షమాపణ చెప్పబడినది. ఇట్లు ప్రాప్తి ప్రతిబంధకములుగా నుండు పూర్వాపరాధములు లేవని కూడా తెలిపిరి. బాహ్య విషయములందు సంగమమును విడిచి, భగవద్విషయములనందే రుచితో పొందనిదే ఉండలేక, ఆర్తితో చేరితిమనుటతో ఆత్మస్వరూప విరోధి సంబంధము లేదని సంబంధము లేదని తెలియుచున్నది.
మాకితరములైన కోరికలు ఉండకూడదనుటచే భగవదనుభవమున తనది అని కాని, తాననుభవించుచున్నానని బుద్ధి కూడా యుండరాదని తెలుపుటచే ప్రాప్యవిరోధి కూడా లేదని తెలియుచున్నారు.
ఇట్లు అన్ని ప్రతిబంధకములు తొలగి భగవంతునకే సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో నిరంతరాయముగా కైంకర్యము చేయుచు, చేయు కైంకర్యము కూడా భగవంతుని కొరకే భగవానుడే చేయించుకొనుచున్నాడని భావనతో ఉండుటయే తమకు పురుషార్థమని గోపికలు భావనతో ఉండుటయే తమ ప్రతిఫలముగా వివరించిరి.
మరియు ఈ పాశురము అష్టాక్షరీ మంత్రార్థమును కూడా వివరించినది.
గోవిందా! నీకు అను మాటతో సర్వజగత్కారణము సూచించబడినది. మేము అను దానితో మకారార్ధము జీవసముదాయము తెలుపబడినది. ఇట్లు ప్రణవార్ధము వివరించబడినది.
నీతో సర్వవిధ బంధుత్వము కలవారము అని చెప్పుటచే నారాయణ శబ్దార్ధము తెలుపబడినది. ఎప్పటికి ఏడేడు జన్మలకు అని చె ప్పుట వలన ‘ ఆయ ‘ అను చతుర్ధీ విభక్త్యర్థమును తెలుపుచున్నది.
ఇట్లు తెలుపుట వలన మూల మంత్రము వలన ప్రతిపాదించుట పరమార్థమే తన వ్రతమునకు పరమోద్దేశ్యమని ఈ పాశురమున తెలుపబడినది. అజ్ఞానము చుట్టబడి, కటిక చీకటి నిండిన జీవితములో, సత్త్వముదయించిన వెంటనే భగవంతుని యందు అభిముఖ్యము కలిగి, భగవంతుని సమీపించి సేవించవలయును. భగవంతుని దివ్యమంగళ విగ్రహ సౌందర్యమును అనుభవించవలయును. ఈ యనుభవము అవిచ్ఛన్నముగా సమృద్ధిగా నుండుటకు ఆ దివ్య సౌందర్యమునకు మంగళా శాసనము చేయవలయును. భగవదాభిముఖ్యము మనకు కలుగునట్లు చేసుకొనవలయును.’ భగవంతుడు అవతారమునెత్తి వెల్లడించవలయును. నీవు కాక మాకు వేరొక ఫలమును కోరుట లేదని స్వామి విన్నవించ వల యును. నిత్య కైంకర్యమును అర్థించుయవలయును. మనకు స్వరూపోపాయ పురుషార్థములను పొందుటలో కలుగు ప్రతిబంధకమును తొలగించుమని ప్రార్థించ వలయును. ఇట్లు విన్నపము గావించిన శ్రీకృష్ణ భగవానుని దివ్యముఖారవిందమును దర్శించు చుండుటయే జీవిత పరమార్థమని, ఇదే ఈ వ్రతమునకు పరమోద్దేశ్యమని తెలియదగును.
డా|| కందాడై రామానుజాచార్య ఎమ్.ఎ., పి.హెచ్‌డి.