Tuesday, November 26, 2024

తిరుప్పావై ప్రవచనాలు :

పాశురము : 23
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

మారి మలై ముళఞ్గ్జి మన్ని క్కిడన్దుఱఙ్గుమ్‌
శీరియ శిఙ్గ మఱివిత్తు త్తీ విళిత్తు
వేరి మయిర్‌ పొఙ్గ వెప్పాడుమ్‌ పేర్‌న్దు దఱి
మూరి నిమిర్‌న్దు ముళ ఙ్గి ప్పుఱప్పట్టు
పోదరు, మాపోలే; నీ పూవై ప్పూవణ్ణా! ఉన్‌
కోయిల్‌ నిన్ఱిఙ్గనే పోన్దరుళి, కోప్పుడై య
శీరియ ళిఙ్గాసనత్తిరున్దు, యామ్‌ వన్ద
కారియమారాయ్‌ న్దరళే లో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

తాత్పర్యము :
” వర్షాకాలమునందు పర్వత గుహలలో ఆడ సింహమును తానును ఒక్కటే వస్తువు అనునట్లు కలసిపోయి పడకపై నిద్రించుచున్న పరాక్రమము యొక్క అతిశయముతో కూడియున్న సింహము మేల్కాంచి తన శత్రుమృగములపై కోపముతో నిప్పు కణములు రాలునట్లు కన్నులను తెరచి చూచుచు, పరమళించు చున్న మెడపై జూలు నిక్కపొడుచుకొనగా, నాలుగు వైపులకును కదిలి శరీరము నొక్కసారి దులుపుకొని, బాగుగా ఆపాద మస్తకము సాగి గట్టిగా గర్జించి, గుహనుండి బయటకు వచ్చున ట్లుగా, ఓ కృష్ణా! అతసీ పుష్పమువలె నల్లనైన శరీరము గల నీవు నీ ప్రాసాదము నుం డి యిచ్చటికి వేంచేసి, జయశీలయై సంకల్పించిన పనిని నెరవేర్చి యిచ్చు వైలక్షణ్యముగల సింహాసనము నందు వేంచేసి యుండి, మేము తలబెట్టి వచ్చిన పనిని విచారించి కృప చేయవలయును.”
ఇచట వర్షమనగా భగవత్కృపా సముద్రము నుండి కారుణ్యమనెడు వాయువుచే కదలబడిన నీటి కెరటముల నుండి బయలువెడలిన భగవత్కటాక్ష ప్రసరణము.
ఇచట గుహయనగా వేదగుహ. ఇచట నున్న ‘శీరియ సింగ’ మనగా లక్ష్మీసహిత నారాయణుడు.దీని భావమే ”ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం” అను శ్రుతిచే చెప్పబడినది.
సింహము తెలివి తెచ్చుకొనుట అనగా చేతనులను వారి వారి కర్మానుగుణముగా శరీరములను సృజించి అందు చేర్చుటకు తగిన సమయము వచ్చినదని గుర్తించుట. ఇదియే కారణతత్త్వములోని మొదటి స్పందనము. ఇదియే మేల్కొనుట ఆశ్రిత రక్షణావసరమును గుర్తించుట.
చూచుట యనగా సృష్టికి సంకల్పించుట.
‘ఐక్షత బహుస్యాం ప్రజాయేయ’ అనునది శ్రుతి వాక్యము. ఇట్లు సంకల్పించగనే మొదట తేజస్సు దానినుండి జలము పృధివి ఆవిర్భవించును. ఈ క్రమమునే ”తీవిళిత్తు, వేరిమయిర్‌ పొంగ” అని చెప్పబడినది. సృష్టి క్రమ వికాసమే ”ఎప్పాడుం పేరిందుదరి, మూరినిమిరిన్దు” అను వాటితో చప్పబడినది. పరతత్త్వము కారణావస్థను వదిలి కార్యావస్థను అనగా జగద్రూపము నందునపుడు ప్రకృతి రూపుగాంచిన పరమాత్మ శరీరములో కలిగెడి మార్పులను ” ముళంగి పురప్పట్టు పోదరుమాపోలే” అనుదానిచే చెప్పబడినది.
కార్యావస్థ నొందిన పరమాత్మలోని సౌలభ్యమే ‘ అతసీ పుష్ప సచ్చాయ ‘
ఇచట కోయిల్‌ అనగా ప్రణవము ఇదియే పరమాత్మకు, జీవాత్మయగు ఆచార్యునకు నివాసము కదా!
విభూతి పరమాత్మ సింహాసనము

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement