Monday, November 18, 2024

తిరుప్పావై ప్రవచనాలు :

పాశురము : 13
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

పుళ్ళిన్‌వాయ్‌ కీణ్డానైప్పొల్లా వరక్కనై,
క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్‌,
ప్పిళ్ళైగళెల్లారుమ్‌ పావైక్క ళమ్బుక్కార్‌,
వెళ్ళియెళు న్దువియాళముఱఙ్గిత్తు,
పుళ్ళుమ్‌ శిలుమ్బిన్‌ గాణ్‌ పోదరి క్కణ్ణినాయ్‌,
కుళ్ళక్కు ళిరక్కుడైన్దు నీరాడాదే,
పళ్లిక్కిడత్తియో వాపాయ్‌ నీనన్నాళాల్‌,
కళ్ళమ్‌ తవిర్‌న్ధు కలన్డేలో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
” పక్షి (కొంగ) శరీరమున ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి, తన్ను కాపాడుకొని, మనను కాపాడిన శ్రీకృష్ణ భగవానుని, దుష్టరాక్షసుడగు రావణుని పదితలలను విలాసముగా గిల్లి పారవేసిన శ్రీరామచంద్రుని గానము చేయుచు పిల్లలందరును వ్రతము చేయవలసిన ప్రదేశమునకు వెళ్ళుచున్నారు. తుమ్మెదలో నున్న తామరపూవులబోలిన కన్నుల గలదానా! శుక్రుడు ఉదయించుచున్నాడు. గురుడస్తమించు చున్నాడు. పక్షులు కూయుచున్నవి. విరహతాపము తీరునట్లు చల్లగా మునిగి స్నానమాడక శయ్యపై పరుండుటేల? ఈ మంచిరోజున నీవు కపటమును వదిలి మాతో కలిసి ఆనందము ననుభవింపుము. ”
ఇచట కొంగయనగా దంభము. ఇతరులను హింసించ దలచినవాడు తన స్వభావము తెలియరాకుండగా సజ్జనునిగా కన్పట్టచూచుట దంభము.
రావణుడనగా అహంకారము. అహంకారమును తొలగించునది ఆచార్యుడు భగవన్నామ సంకీర్తనముచే అహంకారము తొలగును.
భాగవతోత్తములలో ఒక్కరు తక్కువున్ననూ రసపూర్తి యుండదు. అందరూ కావలయును.
శుక్రుడనగా జ్ఞానము. బృహస్పతి యనగా అజ్ఞానము. బృహస్పతి యనగా అజ్ఞానము. పక్షులనగా ఆచార్యులని మొదటే చెప్పి యుంటిమి.
నేత్రమనగా జ్ఞానము. నేత్ర సౌందర్యమనగా భాగవతోత్తముల స్వరూపమును తెలియకలుగుట. స్నానమనగా భగవత్సంశ్లేషము.
భగవదనుభవమును ఒంటిగా చేయుటయే కపటము. అందరిలో కలిసి చేయవలయును.
ఈ పాశరమున తొండరడిప్పొడి యళ్వారులను మేల్కొలుపుచున్నారని తెలియవలయును.
ఈ పాశరమున ‘పోతరికణ్ణినాయ్‌’ అని పిలిచి యున్నారు. పూలను సమకూర్చుటలో దృష్టి నిలిపిన వారు అని అర్థము. ఈ ఆళ్వార్లు పుష్పకైంకర్య పరాయణులు.
‘తోడైత్త, తువళముమ్‌ పొలన్దు తోన్నియతోళ్‌ తొండరడిప్పొడి’ అని కదా. అనగా అందముగా కట్టబడిన దివ్వములగు తులసి మాలలతో నిండిన బుట్టను భుజము నందు ధరించి ఎల్లప్పుడు దర్శన మొసంగు తొండరడిప్పొడి యానిదాసుని’ అని అర్థము. ఈ పాశురమున శ్రీకృష్ణుని శ్రీరాముని పాడిన విధముగనే ఈ అళ్వారులు కూడా ‘తిరుమాలై’ ప్రబంధములో శ్రీకృష్ణుని, శ్రీరాముని చరితమును గానము చేసిరి. ఒక ‘పావాయ్‌’ అనగా పతివ్రత. పతివ్రత అనగా భర్త యొక్కనికే వశమైయుండుట. ఈ ఆళ్వారు రంగనాథుని ఒక్కరినే ఆశ్రయించి ఇతర దివ్యదేశములందు వేంచేసియున్న స్వామిని మనసులో కూడా తలచనివారు. కావున ఈ పాశురము వీరికి చక్కగా సరిపోవును.
ఇక గురుపరంపరలోని ‘శ్రీ పుండరీకాక్షాయ నమ: అను వాక్యమును అనుసంధానము చేసుకొనవలయును. ఇందు ‘పోతరిక్కణ్ణినాయ్‌’ అని నేత్ర సౌందర్యమునే చెప్పియున్నారు కదా. ఇచట నేత్రమనగా జ్ఞానము.
సర్వతోముఖముతో విస్తరించు జ్ఞానము కలవార. శ్రీ పుండరీకాక్షులు కావున పాశురమున ఈ వాక్యము సరిపోవును.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement