Friday, November 22, 2024

తిరుప్పావై ప్రవచనాలు :

పాశురము : 4
ఆండాళ్‌ తిరువడిగలే శరణం

ఆళి మళై క్కణ్ణా ! ఒన్ఱు నీ కైకర్‌ వేల్‌
ఆళి యుళ్‌ పుక్కు ముగన్దు కొడార్‌ త్తేఱి
ఊళి ముదల్వనురువమ్‌ పోల్‌ – మెయ్‌ కఱుత్తు
పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్‌ కైయిల్‌
ఆళి పోల్‌ మిన్ని వలమ్బురి పోల్‌ నిన్ఱ దిర్‌ న్దు
తాళాదే శార్‌ఙ్గ ముద్దె త్త శరమళై పోల్‌
వాళ వులగినిల్‌ పెయ్‌దిడాయ్‌ – నాఙ్గళుమ్‌
మార్‌ గళి నీరాడ మగలిన్దే లో రెమ్బావాయ్‌

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
అనన్య భక్తితో పరమాత్మ నాశ్రయించిన వాని వద్ద దేవతలందరు ఆజ్ఞావశర్తులై యుందురు. ఈ గోపికలు ఉత్తముని పేరు పాడి వ్రతమున కుపక్రమించిరి. వెంటనే వారి కోరిక ననుసరించి వర్షాధి దేవతయగు పర్జన్యుడు పాడిపంటలు బాగుగా వృద్ధి చెందుటకు తగిన రీతిగా వర్షించుటకు వారి యెదుట సాక్షాత్కరించెను. ఇపుడు గోపికలు పర్జన్యునకెట్లు వర్షింపవలయునో ఆజ్ఞాపించుచున్నారు.
‘గంభీర స్వభావము కలిగిన వర్షనిర్వామకుడా! పర్జన్య దేవా! నీవు ఔదార్యములో సంకోచము నేమాత్రము చూపకుము. గంభీర సముద్ర మధ్యమున కేగా ఆ సముద్ర జలమునంతను త్రాగి, గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కారణభూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహమువలె శ్యామల మూర్తివై, అతని దక్షిణ బాహువునందలి చక్రమువలె మెరిసి, ఎడమ చేతిలోని శంఖమువలె ఉరిమి, శార్‌ఙము నుండి వెలువడు బాణములవలె లోకమంతయూ సంతోషించునట్లు మేము ఆనందముగా స్నానము చుయునట్లు వర్షింపుము.
ఇచట మేఘమనగా ఆచార్యులు. భగవంతుని కంటె ఆచార్యులకు కారుణ్యమధికము. మేఘము సముద్రములోని ఉప్పునీరును త్రాగి మధుర జలమును లోకమున వర్షించును. ఆచార్యులు కఠినములు దురవగాహములగు శ్రుతిసాగర జలములను త్రావి వాటిని సులభశైలిలో బోధింతురు. భగవద్గుణములను శిష్యులకు బోధింపవలయును. ఆ గుణములు రెండు విధములుగా నుండును.
ఆశ్రయణ సౌకర్యాపాదక గుణములు
ఆశ్రిత కార్యాపాదక గుణములు
1. భగవంతుడు మనచే ఆశ్రయించుటకు అందు బాటులో నండువాడే అని తోచి ఆశ్రయించుటకు వీలు కల్పించు గుణములు.
2. ఆశ్రయించిన వారి కార్యములను చేయగలవాడు అనునట్లు స్ఫురింపచేయు గుణములు.
ఆచార్యునకు జ్ఞానమే కాక తెలిసినది ఆచరించుటే మెరుపు. శంఖమువంటి ధ్వనియనగా ఆచార్యుడు చేయు వేదఘోష. మేఘము వర్షించునట్లుగా ఆచార్యుడు భగవద్గుణాను భవ మును వర్షించును.

- Advertisement -

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement