కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానికి నిన్న 18 గంటల సమయం పట్టగా.. నేడు ఏకంగా 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మొత్తం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. నిన్న స్వామివారిని 65,568 మంది భక్తులు దర్శించుకోగా 25,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీఆదాయం రూ. 4.26 కోట్లు వచ్చిందని తెలిపారు.
రేపు డయల్ యువర్ ఈవో..
డయల్ యువర్ ఈవో కార్యక్రమం రేపు (3వ తేదీ) శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.