Thursday, November 21, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : సర్వభూపాల వాహన సేవ (ఆడియోతో…)

7. సర్వభూపాల వాహనం సేవ ఆంతర్యం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజార్యుల వారి వివరణ

భూపాలులూ అంటే భూములు పాలించే రాజులు. నిజమైన భూపాలుడు పరమాత్మే, వీరినందరిని రాజులను చేసిందీ ఆ పరమాత్మే.

భీషాస్మాత్‌ వాత: పవతే భీషోదేతి సూర్య:
భీషాస్మా దగ్నిశ్చేన్ద్రశ్చ
మృత్యుర్ధావతి పంచమ ఇతి

పరమాత్మ ఆజ్ఞతోటే గాలి వీస్తుంది, సూర్యుడు వెలుగునిస్తాడు, అగ్ని కాలుస్తుంది, మృత్యువు చంపుతుంది అని వేదం చెబుతుంది.

ఇట్లు దేవతలను, రాక్షసులను, మానవులను, మృగములను, రాజులను చేసింది పరమాత్మే. పరమాత్మ అనుగ్రహం ఉంటే ఆ ఇంద్రుడు లోకాలను పాలిస్తాడు, అనుగ్రహం తప్పితే ఆ ఇంద్రుడే దేశదిమ్మరి అవుతాడు. ఇలా రాజులను చేసినా భక్తులను చేసినా పరమాత్మే. లోకాలకు రాజులైన బ్రహ్మ ఇంద్రాదులు పరమాత్మ శాసనాన్నే పరిపాలిస్తారు. అందుకే రాజులకు రారాజులకు రారాజు మన మలయప్పే. ప్రజల కోరికలు తీర్చే శక్తిని ఇవ్వమని రాజులందరు ఆ పరమాత్మనే ప్రార్థిస్తారు. వీరందరిలో అంతర్యామిగా ఉండి వారిని ఆశ్రయించిన వారి కోరికలను తీర్చేవాడు పరమాత్మే. అందుకే నిజంగా సర్వభూపాలుడు అంటే అందరికి రాజు పరమాత్మే అని అర్థం. ఇక సర్వభూపాలులకు భూపాలుడు కావున వారందరూ పరమాత్మను తలపై మోస్తారు అని సర్వభూపాలులూ పరమాత్మకు వాహమని అంతరార్ధం. ఇలా కొంచెం లోతుగా వెళితే సకల లోకాలను సకల జీవులను అంతర్యామిగా ఉండి అనగా వారందరిలో తానుండి అందరిని మోసేవాడు సర్వభూపాలుడు. ఇక సకల జీవులు పరమాత్మను తమ హృదయమున నిలుపుకొని మోస్తారు కావున సకల భూపాలులు పరమాత్మకు వాహనం. ఈ సర్వభూపాల వాహనం ‘అంతర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్స్థిత: ‘ అనే శ్రుతి వాక్యాన్ని ఉద్ఘోషిస్తున్నది.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement