Wednesday, November 6, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : మోహినీ అవతార సేవ (ఆడియోతో…)

8. మోహినీ అవతార సేవ ఉపదేశం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజార్యుల వారి వివరణ

తిరుమల బ్రహ్మోత్సవాలలో అన్ని వాహనాలు వాహన మండపం నుండి వస్తాయి. ఈ మోహినీ అవతారం మాత్రం నేరుగా దేవాలయం నుండే వస్తుంది. ఈ మోహినీ అవతారం వెంట చిన్న కృష్ణుడు ఉంటాడు. మోహినీ అంటే మోహాన్ని కలిగించేది. సహజంగా పురుషులందరికి మోహాన్ని కలిగించేది స్త్రీ సౌందర్యం కానీ ఆ స్త్రీలకు మోహాన్ని కలిగించింది కృష్ణ సౌందర్యం. శ్రీకృష్ణ భగవానుని సౌందర్యాన్ని చూసిన గోపికలు ‘త్రుటి యుగాయతే త్వామ పశ్యతాం’ అంటారు. అనగా నిన్ను చూడని ఒక తృటి కాలం కూడ ఒక యుగమవుతుంది అని అంతటి ముగ్ధమోహనమైన జగన్మోహన రూపం పరమాత్మ అని గోపికల ఉవాచ.

క్షీరసాగర మదనంలో అమృతం వచ్చిన వేళ అమృతాన్ని రాక్షసులు తీసేసుకుంటే వారి నుండి అమృతం తీసుకొని దేవతలకి అందించడానికి స్వామి జగన్మోహిని అయ్యాడు. జగన్మోహినీ సౌందర్యం రాక్షసులని మోహింప చేసింది కాని దేవతులు మోహంలో పడలేదు. అంటే సౌందర్యం అందులోనూ స్త్రీ సౌందర్యం రాక్షసులకు, రాక్షస తత్త్వం ఉన్న వారిని మాత్రమే మోహింప చేస్తుంది. జ్ఞానులకు ఆత్మ సౌందర్యం కనబడుతుంది కానీ దేహ సౌందర్యం కాదు. అందుకే మోహినిని చూసి దేవతలు మోహించలేదు. పరమాత్మను నమ్ముకున్న వారు ఎలాంటి మోహంలోను పడరు. పరమాత్మ దివ్య సౌందర్యం కంటే ఏ సౌందర్యం మోహాన్ని కలిగించలేదు. ఎన్ని యుగాలైనా మారని, వాడని సౌందర్యం పరమాత్మునిదే. ప్రకృతి లోని సౌందర్యం పొద్దున పూచిన పువ్వు సాయంకాలానికి వాడుతుంది, ఈనాటి పండు రేపటికి మురిగిపోతుంది. సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో సర్వవిధ సౌందర్యం సకల జగత్తును మోహింప చేయగలిగేది తనది మాత్రమేనని ఆ సకల జగన్మోహనుడైన నారాయణుడు మోహినీ రూపంలో తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ మన కు ఉపదేశిస్తాడు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement