Sunday, November 17, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : కల్ప వృక్ష వాహనసేవ (ఆడియోతో…)

6. కల్ప వృక్ష వాహనం సేవ ఉపదేశం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజార్యుల వారి వివరణ

పంచైతే దేవతరవ: మందార: పారిజాతక:
సంతాన: కల్పవృక్షశ్చ పుంసివా హరి చందనమ్‌

అని అమరకోశం చెబుతుంది. మందారం, పారిజాతం, సంతాన వృక్షం, కల్ప వృక్షం, హరిచందన వృక్షం ఈ అయిదు దేవతా వృక్షాలుగా క్షీరసాగర మదనంలో ఆవిర్భవించాయి. ఇవన్నీ కోరిన వాటిని ప్రసాదించేవే. అన్నింటిలో విశేషమైనది కల్ప వృక్షం. ఈ కల్పవృక్షం కోరిన ప్రతి కోరికను వెంటనే తీరుస్తుంది. కానీ ఆ కల్పవృక్షం కోరికను తీర్చిన వాడు శ్రీమన్నారాయణుడు. కోరిన వారి కోర్కెలు తీర్చే శక్తిని తనకు ప్రసాదించమని కల్పవృక్షము ప్రార్థిస్తే దాని కోరిక పరమాత్మ తీర్చాడు. అందుకే కల్పవృక్షానికి కల్పవృక్షం పరమాత్మ. తనకు ఈ వరం ఇచ్చినందుకు స్వామికి సేవ చేసే భాగ్యం ప్రసాదించమని మరో కోరిక కోరింది కల్పవృక్షం. స్వామి ఆ కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకొని ఆ కోరికా తీర్చాడు.

నిజమైన కల్పవృక్షం తానే అని అందుకే తననే ఆశ్రయించి, సేవించమని, అన్నీ తానే ఇస్తానని కల్ప వృక్షం లోపల ఉండి కోరిన వారి కోరికలు తీరుస్తున్నది తానే కావున భక్తజన కల్ప వృక్షం తానేనని తక్కిన వారందరూ తన సేవకులు మరియు వాహనాలే అని కల్పవృక్ష వాహన ఉపదేశం. కల్పవృక్షం కోరితేనే ఇస్తుంది కానీ గర్భాలయంలో ఉన్న స్వామి భక్తులు తనను మాడవీథులకి రమ్మని కోరకుండానే తన దర్శనాన్ని ప్రసాదించి తరిపంచేస్తున్నారు. అందుకే కోరితేనే కోరికలు తీర్చే చెట్లను, పుట్టలను ఆశ్రయించరాదని శాసించడానికే కల్పవృక్ష వాహనాన్ని అధిష్టించి నాలుగు మాడవీధులలో ఊరేగుతున్నాడు మలయప్ప స్వామి. కల్పవృక్ష వాహనం పై విహరిస్తున్న స్వామిని దర్శించిన వారికి సకల కామనలు తీరుతాయి, కోరని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు స్వామి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement