Monday, November 18, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : అశ్వవాహనం (ఆడియతో..)

అశ్వవాహన సేవ అంతరార్ధం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

అశ్వము అనగా ఇంద్రియములు. మన అన్ని ఇంద్రియములలో ఆయనే ఉండి ఈ అశ్వాలను అదుపులో పెట్టాలి. పగ్గాలు మనస్సు కావున మనసులో స్వామి ఉంటే ఇంద్రియాలు ఆయన చెప్పినట్టే వింటాయి. సారధి బుద్ధి కావున బుద్ధిలోను పరమాత్మే, ఇంద్రియాలలోను పరమాత్మే ఉండాలి. ఇంద్రియాలు నడిపించే వాడు కూడ ఆ పరమాత్మే. అందుకే నారాయణునికి హృషీకేశుడు అని పేరు. హృషీకములు అంటే ఇంద్రియములు, ఈశుడు అంటే నియమించే వాడని అర్థం. ఇలా మన ఇంద్రియ అశ్వాలను వాహనంగా చేసుకొని, స్వామి వేం చేస్తే ఇక సంసారంలో ఉండడం కష్టమే.

శ్వ: అంటే రేపు, అశ్వ అంటే రేపు లేనిది. రేపు అనగా ఆశ, అశ్వ అనగా ఆశ లేకపోవుట. ఆశ లేకపోవుట అనగా వైరాగ్యం, వైరాగ్యమే భగవానునికి వాహనం కావున వైరాగ్యంతోటే భగవానుడు మన దగ్గరకి వస్తాడు. సంసారం మీద వైరాగ్యం ఉంటే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. భగవంతునిపై కోరిక లేకుంటే సంసారంలో నిమగ్నమవుతాం. భగవంతునిపై కోరికల గుఱ్ఱాలు కావాలని తలిస్తే ఆ గుఱ్ఱం పై భగవంతుడు తరలి వస్తాడు. ఇలా అశ్వవాహనం అంటే వైరాగ్య వాహనం. ఇలా అశ్వ వాహనం పై విహరిస్తున్న స్వామిని చూసి వైరాగ్యాన్ని పొంది ఆ గుఱ్ఱాలతో పరమాత్మను చేరాలి. ఇలా సూర్యప్రభ అంటే జ్ఞానం, చంద్రప్రభ అంటే భక్తి, రథము అంటే దేహాత్మ వివేకం, అశ్వము అంటే వైరాగ్యం. ఇవన్నీ ఉంటే పరమాత్మే దిగి వస్తాడు, ఇదే ఆ వాహనాలలోని ఆంతర్యం.

కేశి అను రాక్షసుడు అశ్వరూపంలో రాగా కృష్ణుడు అతనిని సంహరించాడు కావున స్వామికి కేశవ అని పేరు. ఆశలు పెరిగేవి అహంకారం తోటే.ఇక్కడ కేశి అంటే అహంకారం. అశ్వ వాహనం అంటే అహంకారాన్ని అదుపులో పెట్టేదని అర్థం. దేహంలో పరమాత్మను చూస్తే దేహం పై మోహం ఉండదు. నా కనులు బాగున్నాయని అనుకోక నా కన్నులలో సూర్యుడు బాగున్నాడు అనేది అశ్వవాహనం. అశ్వము అంటే స్వామి యొక్క హయగ్రీవ అవతారం . ఆ అవతారంతోనే హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడు స్వామి. అశ్వము బలానికి ప్రతినిధి. మనం బలాన్ని కొలిచేది అశ్వం (హార్స్‌ పవర్‌)తోటే. ఆ నిజమైన బలము అనగా అశ్వము పరమాత్మే. శరీరము, ఇంద్రియములు, వాటి బలము కూడా ఆయనే అని తెలిపడానికే స్వామి అశ్వవాహనం పై ఊరేగుతున్నాడు. అలా ఊరేగుతున్న స్వామిని దర్శించి అన్ని వ్యామోహాలను విడిచి పెట్టాలి.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement