Friday, November 22, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : స్వర్ణ రథోత్సవం (ఆడియతో..)

రథోత్సవం విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

రధస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే

అనగా రధములో వేంచేసి ఉన్న భగవంతుని చూసిన వారికి మరల జ న్మ అంటూ ఉండదని భావం. రథమంటే మన శరీరమే.

‘ఆత్మానం రధినం విద్ది శరీరం రధయేవచ
ఇంద్రియాణి హయాన్యాహు:
మన: ప్రగ్రహ యేవచ
ఉద్ధింతు సారధిం విద్ధి’

- Advertisement -

అననది ఉపనిషత్తు వాక్యం. అనగా రథములో కూర్చునేవాడు ఆత్మ, శరీరము రథము, ఇంద్రియములు అశ్వములు, మనస్సు పగ్గము, బుద్ధి సారధి అని అర్థం.

ఈ రీతిలో రథాన్ని కాక శరీరాన్ని మాత్రమే చూసి మురవక సౌందర్యము, లావణ్యం, మెరుపులు, తలపులు అనే మాయలో పడిపోక శరీరంలో ఆత్మ ఉంటేనే అన్ని ఉపచారాలు జరుగుతాయని తెలుసుకోవాలి. శరీరాన్ని నిలిపేది, నడిపేది, ముగించేది ఆత్మేనని తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆ ఆత్మలో అంతర్యామిగా పరమాత్మ ప్రతి అవయవంలోనూ ఒక్కొక్క దేవతా రూపంలో ఉన్నాడు. కంటిలో సూర్యునిగా, నోటిలో అగ్నిగా, బాహువులలో ఇంద్రునిగా, పాదాలలో విష్ణువుగా, నాసికలో వాయువుగా, చెవులలో దిక్కులుగా ఇలా శరీరమంతా అణువణువు వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మే అని తెలసుకోవడమే రథములో ఉన్న స్వామిని చూడడం. శరీరమునే చూసుకొంటే సంసారంలో పడతాము, శరీరాన్ని మాత్రమే పోషించుకుంటే యమలోకానికి చేరతాము. కావున శరీరంలోని అణువణువు ఉన్న స్వామిని సేవించి దర్శిస్తే ఆ స్వామి వద్దకే చేరతాము అంటే మోక్షానికి వెళతాం అనగా మళ్ళీ జన్మించమని అర్థం. అందుకే రథోత్సవం నాడు కొండలన్నీ భక్తులతో నిండిపోతాయి. భక్తుల గుండెలలో నిలిచిన ఆ కొండల రాయుడిని సేవిస్తే మనకి ఏ గండాలు ఉండవు. అన్నీ భగవంతునికి దండాలుగా మారి మన అరదండాలు తొలగిస్తాయి. కావున రథోత్సవాన్ని వీక్షించి ఆ రథాన్ని మన శరీరంలోనే చూసుకుని అనగా మన అవయవాలలో పరమాత్మను చూసి, కొలిచి, తలచి, తరించి ఆ పరమాత్మ కృపకు పాత్రులు కావాలి.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement