Friday, November 22, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : గరుడ వాహన సేవ (ఆడియతో..)

గరుడ వాహన సేవ అంతరార్ధం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

మన వేదములు, పురాణములు, ఇతిహా సములు, గరుత్మంతుడిని వేద స్వరూపుడు అంటాయి. వేదమే గరుత్మంతుడిగా అవతరరించిందని అఖిల పురాణ ఇతిహాస సారం. సామాన్యముగా వాహనము అంటే మంత్రమే, మంత్ర మంటే భగవానుని నామమే. పేరుతో పిలిస్తే దూరంగా ఉన్నవారు దగ్గరగా వస్తారు అంటే వారి పేరే వారిని మోసుకొని మన దగ్గరకు తీసుకొని వస్తుంది. భగవానుని పేరంటే మంత్రం, మంత్ర జపం చేస్తే భగవానుడు ప్రత్యక్షమవుతాడు అనడంలో ఆ మంత్రమే భగవానునికి వాహనమై మన దగ్గరకి తీసుకొని వస్తుంది అని అర్థం. అన్ని వేదాలు భగవంతుడినే తెలుపుతున్నాయి. భగవంతుని స్వరూపం మనకు వేదం వలనే తెలుస్తుంది అంటే వేదమే గరుత్మంతుడిగా అవతరించినది అని అర్థం. వేదం పూర్వభాగం, ఉత్తర భాగం అని రెండు భాగాలు. పూర్వ భాగం ధర్మాన్ని చెబుతుంది, ఉత్తర భాగం ఆ ధర్మం చే ఆరాధించబడే పరమాత్మను చెబుతుంది అంటే పూర్వభాగం కర్మ, ఉత్తర భాగం జ్ఞానం. జ్ఞానంతో భగవానుని తెలుసుకొని, కర్మతో ఆరాధించాలి. అందుకే గరుత్మంతుడికి రెండు రెక్కలు, ఒకటి ధర్మం మరొకటి జ్ఞానం. రెండు రెక్కలు గల గరుడుడు, రెండు భాగాలు గల వేదం.

వేదమే భగవానునికి అన్ని రకముల సేవలు చేస్తుంది. అందుకే గరుత్మంతుడు కూడ ‘దాస: సఖా వాహనం ఆసనం ధ్వజ: యస్తే వితానం వ్యజనం త్రయీమయ:’ అని గరుడిని స్తోత్రం చేస్తారు. గరుత్మంతుడు పరమాత్మకు దాసుడు, పరమాత్మకు మిత్రుడు, అలాగే వాహనము. పరమాత్మ కూర్చుంటే సింహాసనముగా, ప్రయాణం చేస్తుంటే ధ్వజముగా, ఎండ కాస్తే గొడుగుగా, స్వేదమోస్తే విసనకర్రగా ఇలా అన్ని రకముల సేవలు చేసే గరుడుడు ‘త్రయీమయ:’ అంటే వేద స్వరూపుడు గరుత్మంతుడని, అలాగే ఇవన్నీ చెప్పడంలో అంతరార్థం మరొకటి ఉంది.

పరమాత్మకు దాస్యం ఎలా చేయాలి, దాసుడు ఎలా ఉండాలి, స్నేహమెలా చేయాలి, స్నేహితుడు ఎలా ప్రవర్తించాలి, పరమాత్మను ఎలా ధరించాలి, తనలో పరమాత్మను ఎలా నిలుపుకోవాలి, తాను పరమాత్మకు ఎలా చిహ్నము కావాలి అని వేదము ఈ విధానాలను బోధిస్తుంది. కుతర్కాలతో, కువాదాలతో, కుచ్ఛితమైన ఆలోచనలతో పరమాత్మను లేని వానిగా చూపే వారి మాటలు మరియు ఎండలు, వానలు, ఆయుధాలు పరమాత్మను తాకకుండా ఎలా కవచం, ఛత్రం కావాలని బోధించింది వేదం. సంసారుల అజ్ఞానము, మోహము చూసి డస్సిపోయిన పరమాత్మను సేవించే అన్ని విధానాలను చెప్పింది వేదమే. గరుడుడు ఇన్ని విధాలుగా సేవిస్తున్నాడంటే వేదం చదివి ఈ రీతిలో స్వామిని సేవించాలని మనకు బోధిస్తున్నాడు.

వాలఖిల్యులు అనగా సూక్ష్మదేహం గల ఋషుల సంకల్పంతో పుట్టిన ఇంద్రుడు గరుత్మంతుడు. కశ్యప ప్రజాపతి యాగం చేస్తుండగా ఆ యాగానికి కావలసిన సమిధలను ఇంద్రాదిదేవతలు తీసుకుని రాగా వాలఖిల్యులు కూడ తమ వంతు సహాయం చేయదలచి సూక్ష్మదేహం కలవారు కావున 60,000 మంది కలిసి ఒక చిన్న మోదుగు పుల్లను మోసుకొని వస్తూ ఉండడం చూసిన ఇంద్రుడు పరిహాసం చేయగా కోపించిన వాలఖిల్యులు ఇంద్రుడి కంటే వేయి రె ట్లు బలసంపన్నులు, మూడు లోకాలకు కొత్త ఇంద్రుడిగా అయ్యేవాడిని సృష్టించడానికి యజ్ఞం మొదలుపెట్టారు. అది తెలిసిన ఇంద్రుడు తన తండ్రి కశ్యపుని వద్దకు వెళ్ళి ప్రార్థించగా, కశ్యపుడు వాలఖిల్యుల వద్దకు వెళ్ళి మీ మాట ప్రకారం కొత్త ఇంద్రుడే వస్తాడు అయితే అతను పక్షేంద్రుడని ఇంద్రుడిని దింపడం భావ్యం కాదని ఓదార్చి ఆమోదింప చేశాడు. అలా పుట్టిన వాడు పక్షీంద్రుడు ‘గరుడుడు’. ఈ కథ ద్వారా పెద్దలను అవమానించరాదు సేవించాలి అనే నీతి తెలుస్తోంది. అందుకే గరుడుడు మాతృదాస్యాన్ని తొలగించి తల్లికి సేవ చేస్తాడు. మాతృసేవ ప్రభావంతో పరమాత్మకే వాహనమయ్యాడు. తల్లిదండ్రులను, గురువును, పెద్దలను సేవిస్తే పరమాత్మ ప్రసన్నుడయ్యి సాక్షాత్తుగా తన సేవా భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అన్న సత్య ధర్మాలను మనకు బోధించినవాడు గరుత్మంతుడు లేదా వేదరాశి. ఇంతటి విశిష్టమైన గరుడ వాహనం పై స్వామి తిరుమల మాడ వీధులలో గోదాదేవి సమర్పించిన మాలను, సహస్ర నామ మాలను, లక్ష్మీహారం వంటి ఇతర హారాలను, మూల వరుల ఆభరణాలతో విహరిస్తాడు. గరుడ వాహనం పై విహరిస్తున్న స్వామిని సేవించిన వారికి సకలాభీష్ట సిద్ధితో పాటు జ్ఞాన, వైరాగ్యములు కూడ సమకూరుతాయి.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement