Monday, November 25, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : గజవాహనం (ఆడియతో..)

గజవాహన సేవ ఆంతర్యం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

గజము మహాబలము కలది అయినా చిన్న అంకుశానికి లొంగుతుంది. గడ్డితో చేసిన తాడుకు కట్టుబడుతుంది. తనని కట్టేసే తాడును తానే మావటికి అందిస్తుంది. మావటి చెప్తే ఎవరినైనా తనపై ఎక్కించుకుంటుంది. నీటిలో స్వచ్ఛంగా స్నానం చేసి ఒడ్డుకు వచ్చి తొండంతో మట్టి తనపై పోసుకుంటుంది. మదమొస్తే ఎవరి మాట వినదు. ఇవన్నీ కూడా భగవంతుని లక్షణాలు, ఆచార్య లక్షణాలు. అంత పెద్ద భగవంతుడు కూడ భక్తి అనే అంకుశానికి లొంగుతాడు. దాస్యమనే తాడుతో కట్టబడతాడు. దాస్యానికి లొంగుతానని చెప్పి తనని కట్టేసే తాడును తానే ఇచ్చాడు. గురువు గారు చెబితే ఎవరినైనా అనుగ్రహిస్తాడు. ఏనుగు తన మీద ఎక్కాలనే వారికి తన పాదాన్ని ముందరకి వంచి దానిపై నుంచి తన పైకి చేర్చుకుంటుంది. భగవంతుడు కూడ తనని చేరాలనుకున్న వారికి తన పాదాన్ని కొలవమని చూపుతాడు. ఇలా గజమంటే భగవానుడు, ఆచార్యుడు.

భగవంతుడు భక్తుడిని కరుణిస్తాడు, మదించిన వారిని సంహరిస్తాడు. అందుకే భగవంతుడు ఒక గజేంద్రుడిని తానుగా వచ్చి రక్షించాడు, మరొక గజేంద్రుడు కువలయా పీడాన్ని వధించాడు. మొదట దానికున్న నాలుగు దంతాలను ఊడ బెరికి వధించాడు. ఈ నాలుగు దంతాలే నాలుగు అహంకారాలు. నేనే కర్తను, అన్ని తెలిసిన వాడిని, అన్నీ అనుభవించే వాడిని, భగవంతుడకి నేను మాత్రమే దాసుడినని తలచే వాడు భగవంతుని దయను పొందలేడు. ఈ నాలుగు గుణాలను వీడిన వారు భగవంతుని చేరుతారు అందుకే ఆ నాలుగు దంతాలు బెరికాడు. ఇలా ఇంతటి విశిష్టమైన సేవ చేస్తున్న గజేంద్రుడిని వాహనంగా చేసుకొని తిరుమల నాలుగు మాడ వీధులలో విహరించే స్వామిని దర్శించి మన అహంకార మమకారాలను తొలగించుకుని భగవం తుని కృపకు పాత్రులవుదాం.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement