Saturday, November 23, 2024

Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు..

తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామి వారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా శుక్ర‌వారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆల‌యం ముందు ఈ గొడుగుల‌ను టీటీడీ ఈవో ఏవీ.ధ‌ర్మారెడ్డికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌ఆర్ గోపాల్‌జి మాట్లాడుతూ.. ఈనెల 25న చెన్నై నుంచి 11 గొడుగుల ఊరేగింపు ప్రారంభ‌మైంద‌న్నారు. చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం తిరువళ్లూరులోని వీరరాఘవ పెరుమాళ్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామ‌న్నారు. గురువారం రాత్రి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి 2 గొడుగులను సమర్పించిన‌ట్టు చెప్పారు. గత 17 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి గరుడ సేవ నాడు అలంకరించడానికి శ్రీవారికి గొడుగులు స‌మ‌ర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో హిందూ ధర్మార్థ సమితి ఫౌండర్ వేదాంతం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement