Thursday, November 21, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలు : చంద్రప్రభ వాహనం (ఆడియతో..)

చంద్రప్రభ వాహన సేవలోని ఆంతర్యం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

‘చంద్రమా మనసోజాత:’ అని వేదవాక్కు. చంద్రుడు భగవానుని మనసు నుండి పుట్టాడు. అందుకే చంద్రుని వెన్నెల ప్రతి వారి మనసును వికారానికి గురి చేస్తుంది. సూర్యుని ఎండే చంద్రుడి ద్వారా వెన్నెలగా ప్రసరిస్తుంది. ఈ చంద్రుడు తన అమ ృతం ద్వారా దేవతలను, కవ్యము ద్వారా పితృదేవతలను, వెన్నెలతో పంటల ద్వారా మానవులను, మంచు, వెన్నెలతో సకల వృక్షజాతిని వాటి ద్వారా పండ్లని ఇచ్చి పక్షులను పోషిస్తాడు. అందుకే చంద్రుడిని ఓషధీశుడు, ద్విజరాజు అని వ్యవహరిస్తారు. ఇంకొక మార్గంలో చంద్రుడు అంటే ఆచార్యుడు. సూర్యని కాంతైన ఎండను మనం నేరుగా చూడలేం. అదే చంద్రుని ద్వారా వెన్నెలగా వస్తే ఓలలాడుతాం. భగవంతుడిని నేరుగా చూడలేము. భగవంతుడు పంపిన ఆచార్యున్ని సులభంగా చేరుకుంటాము. అంటే వేదాంత సంప్రదాయంలో చంద్రుడంటే ఆచార్యుడు. మరి భగవంతుడిని మన దగ్గరకు తీసుకొని వచ్చేది ఆచార్యుడే కావున చంద్రుడంటే ఆచార్యుడు.

చంద్రుడం టే మనస్సు, ఆ చంద్రప్రభ మనస్సు యొక్క ప్రసారం ఆచార్యుని దయ. చంద్రప్రభ వాహనం అంటే గురువు గారి దయే ఆ భగవంతుని వాహనం. మనం పిలిస్తే రాని భగవంతుడు, గురువు పిలిస్తే వస్తాడు. చంద్రుడంటే మనస్సు కావున ఆ భగవంతుని మనస్సులో నిలిపితే అంటే చంద్రప్రభ మనసు నుండి కలిగే భక్తి ఆ భక్తే భగవంతునికి వాహనం. ఇలా ఆచార్యుని దయ, జీవుని భక్తి ఇవే చంద్రప్రభ. ఇలా చంద్రప్రభ వాహనాన్ని అధిష్టించి తిరుమల మాడ వీధులలో విహరించే మలయప్ప స్వామిని సేవించి ఆచార్య కృపతో భగవత్భక్తిని పొంది భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలి. ఇలా సూర్యప్రభ అంటే జ్ఞానం, చంద్రప్రభ అంటే భక్తి. ఇలా జ్ఞానం, భక్తి పొంది భగవంతుడిని ఆరాధించడమే ఈ వాహన సేవలోని ఆంతర్యం.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు,
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement